#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

  మేమింత వరకూ బోధించిన సర్వాత్మ భావం The subjective na-ture of all the objective world మీకింకా మనస్సుకు రాకపోతే మీకొక చక్కని దృష్టాంత మిచ్చి దాన్ని ప్రతిపాదిస్తాము వినమంటున్నాడు వ్యాస భగవానుడు. యధాకాశ స్థితో నిత్యం వాయు స్సర్వత్ర గో మహాన్. ఆకాశంలో నిత్యమూ వాయువనే దొకటి అందులోనే ఉండి ఇటూ అటూ కదులుతూ మెదులు తుంటుంది. ఆకాశం సరిహద్దులు దాటిపోదు వాయువు. పోలేదు కూడా. ఆకాశమే దాని కా ధారం. దానిమీదనే ఆధేయమయి ఉందది. ఆకాశం వాయువులో లేదు. వాయువే ఆకాశంలో ఉంది. ఆకాశం చలించదు. అది కూటస్థం. కాని అందులో ఉన్న వాయువు చలిస్తుంటుంది. ఆకాశం స్థితి అయితే అది గతి. ఆ మాటకు వస్తే ఆకాశమే చలిస్తే అది వాయువు. వాయువే చలించకుండా స్తంభించి పోతే అది ఆకాశమే. అప్పటికి వాయువనేది వేరే లేదు. నిశ్చలమైన ఆకాశం చలిస్తే దాన్ని వాయువన్నాము. చలించే వాయువు నిశ్చలంగా నిలిచిపోతే దాన్ని ఆకాశమన్నాము. ఒకే ఆకాశ మప్పటికి రెండు రూపాలుగా భాసిస్తున్నది. అచలంగా ఒకటి చలంగా ఒకటి. రెండు రూపాలని పేరేగాని రెండూ కలిపి ఒకే ఒక తత్త్వం.

  అలాగే సర్వాణి భూతాని మఱ్ఱానీ త్యుపధారయ. సమస్త భూతాలూ అవి జీవులే కావచ్చు. జగత్తే కావచ్చు. తుదకు ఈశ్వరుడే కావచ్చు. అనాత్మ రూపంగా చూస్తున్న ఈ సమస్తమూ నాలోనే ఉండి నాలోనే తిరుగుతూ చేస్తూ ఉన్నదని చూడమంటాడు. ఆకాశంలో వాయువున్నట్టే

Page 201

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు