#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

వలసిందే గాని పరమాత్మ వీటిలో వచ్చి కూచున్నాడని చెప్పరాదు. అలా కూచుంటే ఇవి జీవజగదీశ్వర రూపాలుగా ఉండలేవు. పరమాత్మగానే మారిపోతాయి. ఇదీ వస్తువుకూ దాని అభాసకూ ఉన్న తేడా. అందుకే నాలో అవేగాని వాటిలో నేను లేనంటున్నాడు.

  అయితే మరి వాటిలో తాను లేకపోతే ఆయన సర్వ వ్యాపకుడెలా అయ్యాడు. బహిర్వ్యాప్తే గాక అంతర్వ్యాప్తి కూడా చెప్పారు గదా మీరు. వాస్తవమే. చెప్పాము కాని అవి మూడూ అసలు యధార్ధంగా ఉంటేగదా. ఈ ప్రశ్న వస్తుందనే ఒక బ్రహ్మాండమైన రహస్యం బయట పెడుతున్నా డిప్పుడు వ్యాస భట్టారకుడు. అసలా మాటకు వస్తే ఆభాసగా కూడా లేదీ ప్రపంచం. జీవుడూ లేడీశ్వరుడూ లేడు. ఉన్నదా ఒకే ఒక తత్త్వం. అదే బ్రహ్మమదే ఆత్మ. ఇక ఈ అనాత్మగా కనపడేదంతా ఆ భాస అని చెప్పా మింతకుముందు. వాస్తవంగా దేవుడెరుగు. ఆ భాసగా కూడా లేదంటున్నా డిప్పుడీ జీవ జగదీశ్వరులనే అనాత్మ. మరేమి టిది. ఏమిటనే ప్రశ్నేముంది. ఇది అనాత్మ కాదు. ఇది కూడా ఆత్మే. ఆత్మా అనాత్మా రెండూ ఆత్మే. జలమూ తరంగమూ రెండూ జలమే. తరంగమనే భావమే లేదు. కనిపిస్తూన్నా లేదది. ఆ కనిపిస్తున్నది జలమే. అలాంటప్పుడు జలం తరంగంలో ఉండే దేమిటి. అదెలా అబద్ధమో తరంగం జలంలో ఉందనే మాట కూడా అబద్ధమే. అలాగే ఇక్కడ దార్ఘాంతికంలో కూడా. ఆత్మలో కూడా అనాత్మ లేదు. రెండూ ఆత్మే అయినప్పు డిక రెండనే ప్రసక్తి ఏముంది. రెండే కాకుంటే ఇక ఒకదానిలో ఒకటి ఉండే దేమిటి.

Page 198

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు