సమస్తాన్నీ వ్యాపించాడట. సమస్తమంటే ఏమిటది. జీవజగదీశ్వరు లివే సమస్తం. ఇవి మూడూ పరమాత్మతో నిండి పోయాయంటే ఏమిటర్ధం. పరమాత్మే ఉన్నాడు మరేదీ లేదని. వ్యాప్తి అంటే అది మూడు విధాలని చెప్పాము. అంత ర్ప్యాప్తి - బహిర్వ్యాప్తి - స్వరూప వ్యాప్తి. ప్రతిపదార్ధం లోపలా వెలపలే గాక దాని స్వరూపాన్ని కూడా వ్యాపిస్తే అదీ అసలైన వ్యాప్తి. అప్పుడిక ఆ పదార్థ మేమయింది. ఖాళీ. వ్యాపించిన దేదో అదే ఉంటుంది. అది దేన్ని వ్యాపించిందని చెబుతున్నామో అది మాటసామెతే గాని అసలది లేదని అర్ధం. ప్రస్తుతం తానే జీవజగదీశ్వర తత్త్వాలను మూడింటినీ వ్యాపించానని కంఠోక్తిగా చాటుతున్నాడంటే తాను తప్ప అవిలేవనేగా. అంటే పరమాత్మే సత్యం. మరేదీ గాదన్న మాట.
మరి జీవజగదీశ్వరులని చూస్తున్నామే. ఎలాచూస్తున్నాము వీటిని. అవ్యక్త మూర్తిగా అంటున్నాడు మహర్షి. మూర్తి అంటే ఆకారం. అవ్యక్తమైన ఆకారంలో వ్యాపించాడట. అవ్యక్తమైన ఆకారమంటేనే మన కనుమానం వ్యక్తమైన ఆకారం కూడా ఒకటుంది పరమాత్మకని. అందులో అవ్యక్తమైనది కనపడదు. వ్యక్తమైనది కనపడుతుంది. ఇప్పుడీ జీవజగదీశ్వరులని ఏవి గోచరిస్తున్నాయో ఇవి అవ్యక్తమైన ఆ పరమాత్మ వ్యక్తమైన రూపాలన్న మాట. తాను అవ్యక్తంగా ఉంటూ వ్యక్తమైన ప్రపంచంగా తానే బయటపడి కనిపిస్తున్నాడు. అంటే వ్యక్తమూ అవ్యక్తమూ రెండూ తానే. అవ్యక్తంగా వ్యాపకం. వ్యక్తంగా వ్యాప్యం. తన్ను తానే వ్యాపించా డప్పటికి తన్ను తాను వ్యాపించట మేమిటి. తానే తనదిగా కూడా కనిపిస్తున్నాడని భావం.
Page 196