అయితే అలాటి దాన్ని పట్టుకోట మెలాగ. ఎలాగని ప్రశ్నే లేదు. సుసుఖం కర్తు మంటున్నది గీత. దాన్ని పట్టుకోట మతి సులభమట. ఎలాగంటే వ్రాస్తున్నారు భాష్యకారులు. యధారత్న వివేక జ్ఞానమని. ఒక రాళ్ల గుట్టలో నవరత్నహారం పడిపోయిందను కోండి. దాన్ని గుర్తించట మొక పెద్ద కష్టమా. దానికొక పెద్ద ప్రయత్నమా దాని మెరుగే దాన్ని బయటపెడుతుంది. అలాగే చరాచర పదార్థా లన్నిటినీ లోపలా వెలపలా వ్యాపించి ఉన్న సత్తనే తత్త్వాన్ని కూడా దాని ప్రకాశమే బయటపెట్టి చూపుతుంది. ఏమిటది ఎక్కడ ఉంది. నీనా దగ్గరే ఉందది. అదే మనజ్ఞానం. మనస్ఫురణ. దానికే చిత్తని పేరు. అది సత్తయితే ఇది చిత్తు. ఒక పదార్ధ ముండటం సత్తైతే - అది అక్కడ ఉందనే స్ఫురణ చిత్తు The presence and the awareness of the presence. ఇవి రెండూ రెడీమేడ్. సిద్ధంగానే ఉన్నాయి మన అనుభవంలో. రెండూ కలిసి ఒక్కటే. ఉండటమనే స్ఫురణ. అది ఎప్పుడు లేదో చెప్పు. ఎప్పుడూ నీకు సిద్ధంగానే ఉంది. నీదగ్గరే ఉంది. కాని నీదగ్గరే ఉన్నా ఆకాశాన్ని నీవెలా మరచిపోయావో - నీవెప్పుడూ గాలి పీలుస్తూ వదులుతున్నా నీవు దానినెలా గమనించవో - అలాగే గుర్తించటం లేదు. అంతమాత్రమే. అది ఎలా గుర్తిస్తే సరిపోతుందో అలాగే దీన్ని కూడా గుర్తించగలిగితే చాలు. ఎప్పటి కప్పుడది నీకనుభవంలో ఉన్నట్టే. ఇదుగో ఆ సచ్చిద్రూపమే బ్రహ్మం. అదే నీ ఆత్మ. అంతకన్నా కొత్తదేదీ గాదు. బ్రహ్మమూ ప్రత్యక్షమే. దాని నందుకొనే మార్గమూ సులభమే.
Page 191