భగవానుడు. అయితే ఆ జ్ఞానం పరోక్షంగా మాత్రమే ఉండిపోతే లాభం లేదు. అది అపరోక్షం కావాలి. అంటే సర్వమూ ఆత్మేననే మాటవరకే గాక మనసులో తదాకారమైన ఆలోచన లేదా వృత్తి ఏర్పడాలి. అందుకే జ్ఞానం విజ్ఞాన సహితమని షరతు పెట్టింది గీత. విజ్ఞానమంటే బ్రహ్మాకార వృత్తి. ఆ దృష్టితో చూస్తే దృశ్యమైన ప్రపంచమంతా బ్రహ్మాకారంగా దర్శన మిస్తుంది. అప్పుడిక చేయవలసింది గాని సాధించవలసింది గాని ఏముంది. బ్రహ్మమనేది ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. దాన్ని తయారు చేసుకొనే పనేముంది. కాబట్టి భావనారూప మైన ఉపాసన మార్గ మక్కర లేదు. అది సర్వాత్మకం కాబట్టి ఒకటి త్రోసి పుచ్చి ఒకటి పట్టుకొనే యోగాభ్యాసాదు లక్కర లేదు. మరేమి కావాలి. అది ఎలా ఉందో అలాగే దాన్ని గుర్తించే జ్ఞానమే మనకు కావాలి. మరేదీ గాదు. కావచ్చు. జ్ఞానమను విజ్ఞానమను. అది వృత్తి రూపంగా ఉదయించిన మాత్రాన ఆ దృష్టితో చూచినంత మాత్రాన సంసారమనేది సూర్యరశ్మిలో అంధకారంలాగా వెంటనే పటాపంచెలయి పోతుందా. గారంటీ ఇవ్వగలరా. జ్ఞానికి కూడా ప్రపంచం ప్రపంచంగా కనిపిస్తూనే ఉంది గదా అని ఒక పెద్ద ఆక్షేపణ. దీనికి జవాబేమంటే ప్రపంచం జ్ఞానికి కూడా ఉంటుంది. కనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడికీ పోదు. కాని మిగతా లోకులకు కనిపించినట్టు నామరూపాత్మకంగా కనిపించదది. సచ్చిద్రూపంగా కనిపిస్తుంది. అంటే విశేషాలుగా గాక సామాన్యాకారంగా దర్శన మిస్తుంది. ఒక సముద్ర మెలాగైతే తరంగ బుద్బుదాకారంగా గాక జలాకారంగా కనిపిస్తుందో అలాగా. అసలు జలాకారమే సహజం. తరంగాకారమే కృత్రిమం.
Page 185