#


Index

రాజ విద్యా రాజ గుహ్య యోగము

  ఇక్కడ జ్ఞాత్వా మోక్ష్యసే అనటంలో జ్ఞానం వల్లనే మానవుడు ముక్తు డవుతాడు గాని మరి కర్మోపాసనాదుల వల్ల దేనివల్ల కాదని అర్ధ మవుతున్నది. అంతే కాదు. జ్ఞానానంతరం మరి ఏ క్రియా రూపమైన అభ్యాసం కూడా అక్కర లేదని - అసలే పనికిరాదని కూడా స్పష్ట మవుతున్నది. ఎందుకంటే చాలామంది అద్వైతులకు కూడా ఒక అపోహ ఉంది. కేవల మాత్మ అంటే ఏమిటో తెలిసినంత మాత్రాన సరిపోదు. అది సిద్ధాంత జ్ఞానం మాత్రమే. అది మన అనుభవానికి రావాలంటే దాన్నే మనం జీవితంలో అమలుపరచాలి గదా. అలా అమలు పరిచేటప్పుడు ధ్యాన యోగాదు లనుష్ఠించక పోతే అది అనుభవాని కేమి వస్తుందని అపోహ పడుతుంటారు. ఇది శాస్త్రజ్ఞులకే పట్టుకొన్న పెద్ద జిడ్డు. అది వదలకనే శ్రీ విద్యాదులైన ఉపాసనా మార్గాలన్నీ అనవసరంగా తెచ్చి పెట్టారు. మంత్ర తంత్రాదులన్నీ అలాంటివే. వాటితో సతమతమయి పోతూ అసలైన బ్రహ్మజ్ఞానాని కంత కంతకు దూరమయి పోతున్నారు. అద్వైత పీఠాధిపతులని పేరు పెట్టుకొన్న స్వాముల వార్లు కూడా ఏవం విధ విశేషణ విశిష్టులే.

  కాని అసలు విషయ మేమంటే జ్ఞానాదేవ తు కైవల్యం. జ్ఞాన ముదయిస్తే చాలు. అదే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సూర్యోదయం లాంటిదది. సూర్య ప్రకాశం పైకి వస్తే ఇక చీకటి లవలేశం మిగలదు. అలాగే ఈ సర్వమూ ఆత్మ స్వరూపమనే జ్ఞాన ముదయిస్తే చాలు. సంసారమనే చీకటి పటాపంచెలు కాక తప్పదు. అందుకే జ్ఞాత్వా మోక్ష్యసే అని చాటించటం

Page 184

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు