#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

శుక్ల కృష్ణ గతీ హ్యేతే - జగతః శాశ్వతే మతే
ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా 2 వర్తతే పునః - 26


  శుక్లమూ కృష్ణమూ - ఈ రెండే చివరకు పట్టే గతులు మానవులకు. జగతః జగత్తు కంటున్నది గీత. జగత్తంటే కేవలం జడమైన ప్రపంచాని కని గాదు. ప్రపంచంలో బ్రతుకుతూ వచ్చిన మానవులకని అర్ధం. అధికృతానాం జ్ఞాన కర్మణోః అటు సగుణ జ్ఞానానికి గాని ఇటు జ్ఞానరహితమైన కర్మానుష్ఠానానికి గాని యోగ్యత ఉన్న వారికని అర్ధం చెప్పారు స్వామివారు. శాశ్వతే మతే - ఎప్పటికీ ఉంటూనే ఉంటాయట ఈ రెండూ లోకులకు. ఎంచేత. సంసారస్య నిత్యత్వాత్. బ్రహ్మ జ్ఞాని కొకడికి తప్ప మిగతా వారికందరికీ ఈ సంసారమనేది నిత్యంగా ఉండేది కాబట్టి అంటారు భాష్యకారులు.

  ఇది ఇలా ఉండగా ఏకయా యాత్యనా వృత్తిం. శుక్లమైన గతిలో పోయేవాడికి ఆవృత్తి లేదు. అన్యయా ఆవర్త తే పునః - కృష్ణమైన మార్గంలో పోయేవా డా వృత్తి చెందక తప్ప దంటున్నది గీత. ఇక్కడ ఒక్కమాట గుర్తుంచు కోవాలి మనం. శుక్ల గతి - అర్చిర్మార్గం - దేవయాన మనగానే దేవలోకాలకు వెళ్లే వారందరికీ ఆవృత్తి లేదని గాదు. సగుణోపాసకులయి ఆమార్గంలో వెళ్లే వారికి మాత్రమే లేదు ఆవృత్తి. మిగతా దేవతోపాసకు లందరికీ కర్మిష్ఠుల లాగే ఉంటుంది ఆవృత్తి.

నైతే సృతీ పార్ధ జానన్ - యోగీ ముహ్యతి కశ్చన
తస్మా త్సర్వేషు కాలేషు యోగ యుక్తో భవార్జున - 27

Page 173

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు