#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

  మరి ఈ భక్తిరూపమైన జ్ఞానరూపమైన అనన్య భక్తి ఎలా ఉంటుందని అడిగితే జవాబిస్తున్నాడు వ్యాస భట్టారకుడు. యస్యాంతః స్థాని భూతాని. యేన సర్వమిదం తతం. జ్ఞానంతో పట్టుకొన్న ఆ పరమాత్మ ఎక్కడో నీకూ నాకూ దూరంగా లేడు. ఏ దేవలోకంలోనో సత్యలోకంలోనో ఉన్నవాడు కాడు. ఆ లోక మీలోక మనే తేడా లేకుండా సర్వత్రా వ్యాపించిన తత్త్వమది. ఆ దేవతో ఈ దేవతో అనే భేదం లేకుండా సర్వ దేవతా మూర్తులనూ భూత భౌతిక పదార్థాలనూ కూడా ఆవరించి ఉన్నదది. అందులోనే చేరిపోతాయి లోకాలూ లోకేశులూ లోకస్థులూ సమస్త భావాలూ.

  అంతేకాదు. యేన సర్వమిదం తతం. దానిలో ఇవి ఉండటమే గాదు. వీటిలో కూడా అది ఉంది. అది వీటిలో ఇవి దానిలో లోపలా వెలపలా అదే తత మంటే వ్యాపించటం విస్తరించటం. దేన్ని, సర్వ మంటున్నాడు. సర్వాన్నీ అదే. విస్తరించి ఉంది. అలాంటప్పు డిక సర్వానికి చోటు ఎక్కడిది. సర్వమని పేరేగాని వాస్తవంలో అదే ఉంది ఇది లేదు. అయినా కనిపిస్తున్నదే అంటే అదే ఈ రూపంలో కనిపిస్తున్నదని జవాబు. అది స్వరూపం. ఇది దాని విభూతి. అప్పుడిక లోకా లెక్కడున్నాయి. దేవత లెక్కడున్నారు. మన మక్కడికి వెళ్లట మేమిటి. తిరిగి రావట మేమిటి. అంతా హుళక్కే. హుళక్క యినా ఉపాసకుడు అది ఒకటి వాస్తవంగా ఉన్నట్టు తన కది అన్యంగా ఎక్కడో ఉన్నట్టు దానికొక రూపకల్పన చేసి తాను ధ్యానంలో అక్కడికి వెళ్లి దాన్ని అందుకొంటున్నాని భావిస్తున్నాడు. ఇదీ వాడి దృష్టిలో భక్తే. అన్యమైన

Page 167

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు