#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

వ్యావహారికమైతే జ్ఞానం పారమార్ధికం. అది ఆ భాస అయితే ఇది వాస్తవం. అది స్వప్నంలో మనం చేసే ప్రయాణమైతే ఇది జాగ్రత్తులో మనముండే స్థితి. పురుష స్స పరః పార్థ. ధ్యానానికీ గమ్యం పురుషుడే. జ్ఞానానికీ పురుషుడే. వాడూ పరముడే. వీడూ పరముడే. కాని ధ్యానంలో వాడు పురుషుడే గాని పూర్ణ పురుషుడు కాడు. అంటే సాకారమైన సగుణమైన చైతన్యమది. విగ్రహరూపం. జ్ఞానంలో అది సాకారం కాదు. సగుణం కాదు. విగ్రహమంత కన్నా కాదు. పురుష అంటే ఇక్కడ పూర్ణమైన తత్త్వమని అర్ధం. సర్వత్ర ఆకాశంలాగా వ్యాపించి ఉన్నది కనుక పరిచితం కాదు. ఒకానొక ఆకృతి లేదు.

  అలాంటి పూర్ణమైన తత్త్వాన్ని మానవుడు పట్టుకోవాలంటే భక్త్యా లభ్యః - భక్తితోనే పట్టుకోవాలి. అసలు భక్తి అంటేనే పట్టుకోటం. అది సాధకుడు తన కన్యంగానూ పట్టుకోవచ్చు. అనన్యంగానూ పట్టుకోవచ్చు. అన్యంగా పట్టుకొంటే అది ఆత్మ కాదు. అనాత్మ అవుతుంది. అదే ధ్యానం. అలాకాక అనన్యంగా భజిస్తే అనాత్మ కాదు ఆత్మే అవుతుంది. తన స్వరూపమే అప్పుడది. ఇదే జ్ఞానం. ధ్యానికి ఆ పరతత్త్వం అన్యమూ అనాత్మ అయితే జ్ఞానికి అనన్యమూ ఆత్మ స్వరూపమూ. కనుక ఆ పురుషుడు వేరు. ఈ పురుషుడు వేరు. అది సగుణం. ఇది నిర్గుణం. అది పరిచ్ఛిన్నం. ఇది పరిపూర్ణం. అది సశరీరం. ఇది అశరీరం. అందుకే కేవలం భక్తి అని కాక అనన్య భక్తి అని నిర్దేశిస్తున్నది గీత. అనన్య భక్తి అంటే జ్ఞానమనే అర్ధం. అన్యభక్తి భక్తి - అనన్య భక్తి జ్ఞానం.

Page 166

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు