#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

పరమం మమ. పరమమైన ధామం. పరం ధామం. ధామ మంటే స్థానమైనా కావచ్చు. ప్రకాశమైనా కావచ్చు. రెండూ అర్ధమే ధామమనే శబ్దానికి. రెండర్ధాలూ సరిపోతాయిక్కడ. అన్నిటికన్నా ఉత్తమమైన స్థానమూ అదే. అన్నిటికన్నా గొప్ప ప్రకాశమూ అదే.

  ఎందుకంటే ఇంతకు పూర్వం పరాగతి పరమ పురుష అని చాలాసార్లు వర్ణించింది గీత. అది ఆయా దేవతలకు చెందిన లోకాలు వ్యవహారాలు. ఎంత పరమమని వర్ణించినా అది ఆపేక్షికమే Relative ఔపచారికమే Metaphorical ఆత్యంతికం కాదు Eternal శాశ్వతం కాదు. కారణం. అక్కడ ఆయా దేవతలకు చెందిన స్థానాలైతే ఇక్కడ మమ. నా అసలైన స్థానమే నంటున్నాడు పరమాత్మ. కాబట్టి ఇక పతన భయం లేదు. అదిగాక ఇక ఏ దేవతా లోకాలు చేరినా ఎంత కాలం వారిచ్చే భోగా లను భవించినా సుఖం లేదు. మరలా మెడబట్టి తోస్తే కర్మ భూమిమీద పతనం కావలసిందే. కనుక పరంధామ మంటే పరంధామమే ఇది. స్వర్గాది లోకాల లాంటి పరం కాదు. పోతే ధామమంటే ప్రకాశమని కూడా చెప్పాము గదా అర్ధం. దేవతలకు కూడా ఉంది ప్రకాశం. వారూ చైతన్యరూపులే. కాని పరిపూర్ణమైన చైతన్యం కాదది. అఖండ చైతన్యశకలాలవి. అఖండ చైతన్య ప్రకాశ మొక్క పరమాత్మే. కాబట్టి అలాంటి అఖండ చైతన్యమే తన చైతన్యమని అలాటి అచ్యుతమైన స్థితే తన స్థితి అని దర్శించిన మహాజ్ఞాని కిక పునరావృత్తి అనే ప్రశ్నేముంది.

Page 163

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు