#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

భావించవచ్చు గదా. భావించు. కాదన్న దెవరు. జ్ఞాని పరమాత్మే గనుక పరమాత్మ అవతారం నిర్యాణం జ్ఞానికే ననుకో. తప్పేముంది.

  పోతే అన్ని కర్మలూ దగ్ధమయి పోయినా ప్రారబ్ధ కర్మ అనేదొకటి ఉంటుంది జ్ఞానికి. అంటే జీవన్ముక్తుడికి - విదేహముక్తుడికి కాదు. అది పరజన్మల వరకూ ప్రసరించేది కాదు. కేవలం వర్తమాన జన్మవరకే దాని క్షేత్రం. జ్ఞాని విదేహముక్తు డయ్యే వరకూ పట్టి చూస్తుందప్పు డప్పుడు. కాని జ్ఞాన బలంతో దాని ధాటికి జవాబు చెబుతూనే ఉంటాడు వాడు. తస్య తావదేవ చిర మన్నట్టు గడువు తీరగానే అదీ తీరిపోతుంది. పోతే ఇక శరీర బంధం తెగిపోయి అశరీరమైన స్థితే జ్ఞానికి సాగిపోతుంది. కనుక పునర్జన్మ నాప్నువంతి. ఈ జన్మ బాకీ తీర్చుకొని పోవటమే గాని ఇక మరలా జన్మ ఎత్తట మంటూ ఉండదు. ఏమి. ఏత్తితే మాత్రమేమి. జ్ఞాని అయినవాడు భయపడటం దేనికి. నిజమే. భయపడడు. ఆ భాసగా చూస్తే భయపడడు గాని వాస్తవంగా చూస్తే మాత్రం భయమే. కారణం. జన్మ అంటేనే దుఃఖాలయ మశాశ్వతం. ఆధ్యాత్మికాది తాపాలన్నిటికీ నిలయమది. ఏదో కొంత సుఖమనేది లభించినా అది చాలా స్వల్పం. క్షణభంగురం. శాశ్వతంగా ఉండేది కాదు. కాబట్టి అలాటి దుఃఖ భూయిష్టమైన జన్మ ఎత్తవలసిన అవసరం జ్ఞానికేముంది. పరమాత్మే ఎత్తినప్పుడు జ్ఞాని మాత్రమెత్తితే తప్పేముందంటావా. పరమాత్మగా అవతరిస్తాడు. జ్ఞానిగా కాదని జవాబు.

Page 147

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు