#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

సాధకుడికి. యోగమంటే సమాధి యోగం. ధారణా ధ్యాన సమాధు లంటారు యోగులు. దేశబంధ శ్చిత్త స్య ధారణా. ఒకానొక లక్ష్యం మీద మనసును కట్టి వేయటం ధారణ. తత్ర ప్రత్యయైక తానతా ధ్యానం. అక్కడ మనోభావన అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూ పోతే ధ్యానం. ధ్యేయ సమావేశః సమాధిః ధ్యేయంతో మనసు ఏకమైపోతే సమాధి. అప్పుడే ఆ ధ్యేయం తాలూకు బలం ధ్యాత మనస్సుకు బాగా సంక్రమిస్తుంది. సమాధి జ సంస్కార ప్రచయ జనిత చిత్త స్థైర్య లక్షణం యోగబలమని వివరణ ఇచ్చారు భగవత్పాదులు. ధారణాధ్యాన సమాధులు మూడింటి ప్రకర్ష వల్ల ఏర్పడ్డ చిత్త స్థైర్యమే యోగబలం. అలాటి బలముండాలి మనస్సుకు.

  మనసు సంగ తయింది. పోతే ఇక ప్రాణం. దాన్ని కూడా ఇష్టానుసారం వదిలేయ గూడదు. భ్రువో ర్మ ధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ అని సలహా ఇస్తున్నది గీత. భ్రూమధ్యంలో దాన్ని సమ్యగావేశ్య బాగా కదలకుండా నిలపాలంటున్నది. భ్రూమధ్య మంటే రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం. మనం బొట్టు పెట్టుకొనే చోటు. అక్కడికి ప్రాణాన్ని తీసుకురావాలని చెప్పటంలో ఏమిటి ఉద్దేశం. సుషుమ్నా నాడి పైకి వెళ్లి పోయే దారి అది. ఆ సుషుమ్నలో ప్రవేశపెట్టాలి ప్రాణశక్తిని. అంతకు ముందెక్కడ ఉందది. చెబుతున్నారు వినండి భాష్యకారులు. పూర్వం హృదయ పుండరీకే వశీకృత్య. మన శరీరంలో మొత్తం 72 వేల నాడు లున్నాయని యోగుల మాట. అందులో శతం చైకా హృదయస్య నాడ్యః

Page 132

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు