#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

ఇప్పుడా సర్పాన్ని పోగొట్టు కోవాలంటే ఏమి చేయాలి. ఆ భావన వదిలేయాలి. అలాగే అనాత్మ జగద్భావన వదిలేయాలి మనం. ఎలా వదిలేయాలి. ఒకటి పట్టుకొని గాని మరొకటి వదిలేయలేము. కాబట్టి ఆత్మ అనేదేది ఉందో దాని స్వరూపాన్ని గట్టిగా మనసుకు తెచ్చుకొని దాన్నే పట్టుకొని కూచోవాలి. దానికే స్మరణ అని పేరు పెట్టారు. ఆత్మే వస్తువు కాబట్టి అది ఎక్కడికీ పోయేది గాదు. ఎటువచ్చీ దాన్ని గూర్చిన వృత్తే మారుతూ ఉంటుంది. వృత్తి అని అందుకే గదా దానికి పేరు వచ్చింది. మరి ఎలాగా పట్టుకోటమని కంగారు పడక్కర లేదు. అదే ఈ మారే పదార్ధాలన్నిటినీ వ్యాపించి వీటి కధిష్ఠానంగా Base ఉందని తెలుసు కాబట్టి ఇవి తాత్కాలికంగా దాన్ని ఇటూ అటూ లాగుతున్నా శాశ్వతంగా ఉన్నది వీటిలో అదేనని మళ్లీ మళ్లీ దాన్ని స్మరిస్తూ పోవట మేమంత కష్టంగాదు. ఏదైనా అలవాటును బట్టే ఉంటుంది. ఇలా తెగుతుంటే ముడి పెట్టుకోటమే అనుస్మృతీ అనుసంధాన మనే మాటల కర్ధం.

  అప్పుడీ అనాత్మ భావా లేమవుతాయి. వాటితో మనం పోరాడాలా అని ప్రశ్న. యుద్ధ్యచ అని అన్నారు గదా అని వాస్తవంగానే పోరాడాలని భావించరాదు. వస్తువేదో దాన్ని పట్టుకొని కూచుంటే చాలు. అవి దాని ఆభాసలే నని తెలిసిపోతుంది. ఎంతెంత ఆభాస అనిపిస్తాయో అంతంత ఈ ఆత్మ వస్తువులోనే అవి చేరిపోతాయి. దానితో ఏకమయి కనపడకుండా పోతాయి. వెలుతురును పట్టుకొని చీకట్లో ప్రవేశిస్తే ఏమవుతుంది చీకటి.

Page 123

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు