#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

తెగటం - ముడిపెట్టుకోటం ఈ లోపల వాడి మనసు ఖాళీయే గదా. ఆ సమయంలో బ్రహ్మాకార వృత్తి దెబ్బతిన్నట్టే గదా. కాదు. తాత్కలికంగా తిన్నప్పటికీ దాని సంస్కారం పని చేస్తుంటుంది. అది ఎక్కడికీ పోదు. ఆ పని అయిన తరువాత మరలా ఊపందు కొంటుంది బ్రహ్మ వృత్తి. యుధ్యచ అనే మాట ఒకటుం దక్కడ గమనించండి. యుధ్య అంటే పోరాడటమని అర్థం. ఎవడు పోరాడాలి అర్జునుడా. అర్జునుడంటే క్షత్రియుడు కాబట్టి దుర్యోధనాదులతో పోరాడ మని కృష్ణుడతణ్ణి హెచ్చరిస్తున్నాడని అనుకోవచ్చు. కాని గీత ఒక అర్జునుడికే గాదు బోధించింది. అర్జునుడు నిమిత్తంగా మనబోటి లోకులందరికీ చేస్తున్న బోధ అది. మనం క్షత్రియులమూ కాము. మనకే దుర్యోధనాది శత్రువులూ లేరు. అసలు మన మెవరితోనూ యుద్ధం చేయటానికి రాలేదీ ప్రపంచమనే కురుక్షేత్రం లోకి.

  అయితే మనబోటి అర్జునుల మంతా ఎవరితో పోరాడాలని. ఎవరిని జయించాలని. మనమంతా పోరాడ వలసిందీ జయించ వలసిందీ ఎవరోగాదు. ఆత్మకు విలక్షణంగా కనిపించే ఈ అనాత్మ ప్రపంచంతో. అనాత్మ అనేది కూడా ఎక్కడో లేదు వస్తుసిద్ధంగా. వస్తుసిద్ధంగా ఉన్న దస్తిభాతి అనే రూపంలో ఉన్న శుద్ధమైన ఆత్మ తత్త్వమే. అదే మన అజ్ఞానవశాత్తూ అనాత్మగా భాసిస్తున్నది. అనాత్మ ఏదో ననే భావనేగాని దాని కనుగుణమైన పదార్థం బాహ్యంగా ఎక్కడా లేదు. రజ్జువుకు భిన్నంగా సర్పమనేది ఎక్కడుంది. సర్పభావనే సర్పం. అలాగే అనాత్మ భావనే అనాత్మ.

Page 122

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు