#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

కర్మ యోగ ధ్యాన యోగా లభ్యసిస్తూ వచ్చావుగదా ఇంతకాలం. ఇప్పుడా అభ్యాస బలంతో జ్ఞానం పరిపాకానికి వస్తే చెబుతున్నాను విను. మాం యధా జ్ఞాప్యసి. నన్ను నీవేమని అర్ధం చేసుకోవాలో ఎలా పట్టుకోవాలో తచ్ఛృణు. అది జాగ్రత్తగా విను చెబుతున్నా నా మార్గం నీకు అర్జునా.

  నేనంటే ఎవడను కొంటున్నావు నీవు. వసుదేవుని కుమారుడు వాసుదేవుడైన కృష్ణుడనా - లేక దీనికి మూల విరాట్టు వైకుంఠ నివాసి అయిన శ్రీ మహా విష్ణువనా. అలా ఏ రూపంలో భావించినా అది నేను గాను. నా తత్త్వం గాదది. మరి మీ స్వరూప మేమిటది ఎలా ఉంటుందని అడుగుతావా. అసంశయం సమగ్రం మాం. ఏ మాత్రమూ సంశయం లేనిది నా తత్త్వం. ఎంచేతనంటే సమగ్రమైనదది. సందేహ మెప్పు డేర్పడుతుం దెవరి కైనా. తాను గ్రహించవలసిన విషయం సమగ్రం కాకుంటే. సమగ్రమంటే పరిపూర్ణం. ఒక విషయం పరిపూర్ణం కాకుంటేనే దాని విషయంలో మనకు సందేహం. పరిపూర్ణం కాదంటే ఎక్కడికక్కడే పరిమిత మయిందని అర్థం. పరిమితమైతే అది వ్యాపకం కాదు. అన్నింటినీ కలుపుకోలేదు. ఏమిటా అన్నీ. దేశ కాల వస్తువులు. భగవత్తత్త్వం సమగ్ర మనిపించు కోవాలంటే అది దేశమంతా వ్యాపించి సర్వత్రా ఉండాలి. కాలమంతా వ్యాపించి సర్వదా ఉండాలి. అలాగే చరాచర పదార్ధాలన్నీ వ్యాపించి సర్వ ప్రపంచంలో ఉండాలి. లో అని కూడా కాదు. లో అంటే ప్రమాదం. అదీ తానూ ఇద్దరూ పక్కపక్కన ఉండవలసి వస్తుంది. మరేమి టంటారు. లోపలా వెలపలే గాక దేశ కాల వస్తువులు మూడూ తానే

Page 12

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు