#


Index

అక్షర పరబ్రహ్మ యోగము

వెనకటి ఆరోగ్యమే చేకూరుతుం దంటాము. ఇప్పుడా ఆరోగ్యమనేది తాను క్రొత్తగా పొందుతున్నాడా. అది ఆదిలో ఉంది. అంతంలో ఉంది. అంతే కాదు. మధ్యలో కూడా ఉంది. అయితే క్రిములతో మరుగుపడి ఉంది. అవి పోతే పైకివచ్చి కనిపించింది మరలా. క్రిములే మధ్యలో వచ్చి మధ్యలో పోయాయి గాని ఆరోగ్యం కాదు. అది ఎప్పుడూ ఉంది. అదే స్వస్థత. రోగంలాగా సాంక్రామికం కాదది. స్వాభావికం. కేవలం మరుగుపడటం బయటపడి కనిపించటం - అంతవరకే. అలాగే బ్రహ్మ భావ మనేది జీవుడి కెప్పుడూ సహజంగానే ఉంది. అది సంసారమనే వ్యాధితో మరుగు పడిం దిప్పుడు. మరలా బ్రహ్మజ్ఞాన మనే మందు సేవిస్తే రోగం పోయి జ్ఞాని బ్రహ్మ భావమనే ఆరోగ్యం పొందుతా డంటున్నాము. పొందటానికది మనకు భిన్నంగా ఉంటే గదా. మంచం మీద పడుకొని నిద్ర పోయినవాడు స్వప్నంలో ఎక్కడెక్కడికో వెళ్లిపోయి తెల్లవారే సరికి మళ్లీ వచ్చి మంచం మీద పడుకొన్నాడంటే ఎలా ఉంటుంది. వచ్చినట్టు పడుకొన్నట్టు జ్ఞాపకం చేసుకోటమే రావటమూ పడుకోటమూ. క్రియ కాదది. జ్ఞప్తి స్మృతి Recollection. అలాగే బ్రహ్మమే అయి బ్రహ్మానికి దూరమయి పోయానని భ్రమపడి మరలా గుర్తు చేసుకొని బ్రహ్మమే అయ్యానను కొంటున్నాడీ జ్ఞాని. క్రియ గాదిది. అంటే ఎక్కడికో ప్రయాణ మయి పోవటం కాదు. ఏదో తనకు భిన్నమైన దాన్ని పొందటం కాదు. ప్రయాణం గాని ప్రయాణం. పొందటం గాని పొందటం. భావంలో

Page 118

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు