యం యం వాసి స్మరన్ భావం. భావమంటే ఆలోచన అనిగాదు. ఆయా దేవతల రూపాలని అర్థం. అవే స్మరిస్తూ ఉంటాడట ధ్యానం చేసేవాడు. స్మరించటమంటే చింతించటం. ఆ మూర్తినే మనసుకు తెచ్చుకొని దాన్నే జారిపోకుండా మనసులో నిలుపుకోటం. అలా జీవితాంతమూ ఎడతెగకుండా ధ్యానిస్తూ పోతే చివర కేమవుతుంది. ఏమయ్యే దేముంది. ప్రారబ్ధం తీరితే శరీరం పతనమై పోతుంది. మామూలుగా అయితే దానిపాటికదే ప్రాణం పోతుంది. శరీరం కూడా నిశ్చేష్టమై పడిపోతుంది. కాని వీడుపాసకుడు గదా. కనుక అలా పోనీయడు దాన్ని. ఉపాసనా బలంతో ఏ దేవతను మొదటి నుంచీ ధ్యానిస్తూ కూచున్నాడో దాని జ్ఞానం మనసులో బాగా పాతుకొని ఉంటుంది కాబట్టి ఆ సంస్కార మెక్కడికీ పోదు. అది అంత కాలంలో కూడా పని చేస్తుంటుంది. ఆ తెలివి తప్పదు. తంత మే వైతి. ఆ దేవతా సాయుజ్యమే పొందుతాడు. ఉపాసకు లందరికీ లభించే ఫలమిది.
అదైనా ఎలా కలుగుతుంది. మిగతా వారికెవరికీ దక్కని ఆ ఫలం వాడికి మాత్రమే ప్రాప్తిస్తుందని ఎలా చెప్పగల రందులో సబబేమిటని అడిగితే చెబుతున్నది గీత ఒక సత్యం మనకు. సదా తద్భావ భావితః ఇదీ సూత్రం. ఎప్పుడూ ఆ భావమే భావిస్తుంటే వాడి మనసు తద్భావ భావితం కాక తప్పదు. ఆ వాసనే మనసుకు బాగా పట్టి మనసు దానితో నిండిపోయి తదాకారంగా మారిపోతుందని తాత్పర్యం. ఇక్కడ భావన అనే మాట బాగా గమనించండి. ఇది మామూలు మాట గాదు. పారిభాషికం
Page 112