ప్రత్యగాత్మ. అదే ఆయా ఉపాధుల ద్వారా ప్రసరించే కర్మ. అదే ఘనీభవించిన చరాచర జగత్తు. అదే సమష్టి జీవుడైన హిరణ్యగర్భుడు. అదే దేహాభిమాని అయి సంసారంలో బడిపోయిన అధియజ్ఞుడైన జీవుడు. అదే మరలా ఈ సంసార తాపత్రయం నుంచి బయట పడటానికా గుణాతీతమైన తన స్వరూపాన్ని స్మరిస్తూ దానివైపు చేసే ప్రయాణమే సాధన. ఇలా భావన చేస్తూ పోతే ఏడు ప్రశ్నలూ కావు. ఏడు సమాధానాలూ కావివి. ఏడు రూపాలలో మనకు భాసించే ఒకే ఒక బ్రహ్మతత్త్వం తాలూకు ఏడవతారాలు. ఏడు భూమి కలలో ఒకే ఒక బ్రహ్మం మనబుద్ధికి సాక్షాత్కరిస్తున్నది. ఇదే బ్రహ్మాకార వృత్తి. అన్నీ కలిపి ఒకే ఒక బ్రహ్మంగా చూడటం. అఖండాకార వృత్తి. అదే బ్రహ్మమేమిటి హిరణ్య గర్భుడేమిటి జీవుడేమిటి జగత్తేమిటని ఖండఖండాలు గా కాక అఖండంగా దర్శించటం.
ఇలాటి అద్వైత భావన ఏర్పడితే ఇక ఏ సమస్యా లేదు. అన్నీ పరిష్కార మయినట్టే. ఉత్తమాధికారికైతే ఈ జ్ఞానం చాలు. సద్యోముక్తి పొందగలడు. మరి మధ్యమాధికారు లైతే వారు ఒక్కసారిగా ఈ జ్ఞాన మందుకోలేరు. వారికి చెప్పవలసింది ధ్యానం Meditation తద్ద్వారా ఎప్పటికో జ్ఞానం సంపాదించి క్రమంగా ముక్తులవుతారు. ఈ ధ్యాన మార్గమేమిటో అది ఎలా పాటిస్తూ పోవాలో ప్రస్తుతం దాన్ని సవిస్తరంగా వర్ణిస్తూ ఉంది భగవద్గీత.
యం యం వాపి స్మరన్ భావం త్యజ త్యంతే కళేవరం
తం తమే వైతి కౌంతేయ - సదా తద్భావ భావితః - 6
Page 111