
మహానుభావుడికి. కాగా ఇక అధియజ్ఞ మేమిటి. అధియజ్ఞోహమే వాత్ర దేహే. ఈ మానవశరీరంలో వచ్చి కూచొని ఈ ఉపాధి నాదని కాక నేనేనని అభిమానించే చైతన్యాంశ ఏదో అది అధి యజ్ఞమట. యజ్ఞమంటే కర్మ కర్తృత్వం. అదే జీవలక్షణం.
పోతే ఇక ప్రయాణ కాలమేమిటి అప్పుడా పరతత్వాన్ని సాధకుడెలా అందుకోవాలనే ప్రశ్నకు సమాధాన మిస్తున్నాడు వినండి. మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం - యః ప్రయాతి సమద్భావం యాతి. ఆ పరమాత్మనే స్మరిస్తూ భౌతికమైన ఈ శరీరాన్ని తన పాటికి తాను స్వతంత్రంగా ఎవడు వదిలేసి పోతాడో వాడే దాన్ని అందుకోగలడు. దానితో ఏకమై పోగలడని సమాధానం. స్వతంత్రంగా అనటం వల్ల మరణ సమయంలో తెలివి తప్పదువాడి కని అర్ధం చేసుకోవాలి మనం. దానికి కారణం జీవితాంతమూ సాగించిన స్మరణ బలం. స్మరణమంటే బ్రహ్మాకారవృత్తి. బ్రహ్మ జ్ఞానం.
ఇక్కడి కన్ని ప్రశ్నలకూ సమాధానం వచ్చింది. ఇవి ఏడూ ఏడు సమాధానాలను కొంటే అది ద్వైతం. అలాకాక ఏడుగా కనపడుతున్నా అన్నీ కలిసి వాస్తవాని కొక్కటే ననుకొంటే అద్వైతం. పైకి ద్వైతంగా కనిపిస్తున్నా వీటిలోనే అద్వైత భావం నిగూఢంగా మనకు స్ఫురిస్తున్నది. అయితే సవిమర్శంగా చూస్తేగాని బయటపడి కనిపించదు. అది ఎలాగని అడగవచ్చు. బ్రహ్మమనే దొక్కటే ఏడింటికీ కలిపి చెప్పుకోగల సమాధానం.
Page 109
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు