ఆ మూడూ ఈ నాలుగూ కలిసి మొత్తం ఏడు మాట లవకాశ మిచ్చా యర్జునుడు ప్రశ్న వేయటానికి.
అందుకే వేస్తున్నాడు కిం తద్బహ్మ - ఆ బ్రహ్మమేమిటి - కిమధ్యాత్మం అధ్యాత్మ మంటే ఏమిటి. కిం కర్మ - కర్మ కర్ధమేమిటి. అధిభూతమధి దైవ మన్నా రే. వాటి కేమిటర్ధం. అధి యజ్ఞః కధం కోత్ర దేహే
అధియజ్ఞ మనేది ఈ దేహంలో ఏమిటది. ఎలా ఉంటుంది. ప్రయాణ
కాలేచ. మరి ప్రయాణ కాలమని వర్ణించారే. ఆ సమయంలో కధం జ్ఞేయోసి
నిన్ను మేమెలా గుర్తించాలి. తెలివి తప్పుతుంది గదా అప్పుడు. తప్పకుండా
నియతాత్ముల మయి ఎలా పట్టుకోవాలో చెప్పమని అడుగుతున్నా డర్జునుడు. అడుగుతున్నా డంటే అలా అడగటం ఎంతైనా సమంజసం. అర్జునుడనే గాదు. మనకైనా వేయా లనిపించే ప్రశ్నలే ఇవి. ఇందులో రెండు సూక్ష్మా లున్నాయి మనం గ్రహించ వలసినవి. పరి ప్రశ్నేన సేవయా అని ఇంతకు
ముందే వచ్చింది. ప్రశ్న వేస్తేగాని జవాబు రాదు. జవాబు వస్తే గాని
మన సందేహాలు నివృత్తి కావు. నిశ్చయ జ్ఞానం కలగదు. ఇది ఒకటి.
మరొకటే మంటే ప్రశ్న అనేది ఎవరినంటే వారి నడిగి సుఖం లేదు.
నీకెక్కడ అనుమానమో నాకక్కడ సందేహమనే వాడు నీకేమి సహాయ
పడతాడు. అది రోలుపోయి మద్దెలతో మొరపెట్టుకొన్న సామెతే అవుతుంది.
అంచేత అన్నీ తెలిసిన పెద్దలనే అడిగి తీర్చుకోవాలి మన సందేహాలు.
మరి భగవానుడి కంటే పెద్ద లెవ రున్నారు. సర్వజ్ఞుడు గదా ఆయన.
కనుక ఆయన వీటికి జవాబిస్తే దానికిక తిరుగు లేదు.
Page 106