#


Index

జ్ఞాన విజ్ఞాన యోగము

అధి భూతమధి దైవ మధి యజ్ఞమని మూడున్నాయి. భూతమంటే ప్రపంచం. దైవమంటే ప్రపంచ శరీరాని కంతటికీ ఆత్మ స్థానంలో ఉన్న హిరణ్యగర్భుడు Comic person. అధియజ్ఞమంటే ఈ శరీరంలో కూచొని కర్మలన్నీ సాగిస్తున్న చిదాభాసుడైన జీవుడు. ఈ మూడింటిలో జీవ జగదీశ్వరులనే మూడు తత్త్వాలూ కలిసి వచ్చాయి. ఇప్పుడీ మూడింటితో సహా మాం నన్ను యే విదుః ఎవరు పట్టుకోగలరో అంటున్నాడు పరమాత్మ. అంటే ఇవి మూడూ దేనిపాటికది వేరు గావు. మూడూ కలిసి పరమాత్మ చైతన్యమే. అవిద్యా దృష్టికి మూడుగా విభక్తమయి కనిపిస్తున్నాయి. అంతమాత్రమే నని అర్ధం చేసుకోవాలి సాధకుడైన వాడు. అదీ ఎప్పుడో చచ్చిన తరువాత గాదు. బ్రతికుండగానే.

  అలా జీవిత కాంలోనే సాధన చేసి అఖండమైన తన ఆత్మ స్వరూపాన్ని తాను గుర్తించ గలిగితే చాలు. ప్రయాణ కాలేపి చ మాం తే విదు ర్యుక్త చేతసః - అలాటి అద్వైత ధ్యానం బాగా బలపడిన సాధకులు రేపు మరణ కాలంలో కూడా తెలివి తప్పకుండా తమ స్వరూపంగానే ఉన్న నన్ను కూడా దర్శించ గలరని హామీ ఇస్తున్నాడు భగవానుడు. ఈశ్వరుడి కొకటి జీవుడి కొకటి రెండు లేవాత్మలు. ఉన్న ఆత్మ అఖండంగా ఒకటే. జీవుడూ అదే - ఈశ్వరుడూ అదే. ఆ రెండూ అదే అయితే రెంటికీ నడుమ వంతెనగా కనిపిస్తూ వచ్చిన జగత్తూ అదే. ఇదీ దీనిలో ఉన్న ఆంతర్యం.

Page 101

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు