విశేష సంజ్ఞ కాకుంటే మరే సంజ్ఞ అంటారు. సామాన్య సంజ్ఞ. మనస్సు తాలూకు వృత్తి మేరకే అయితే అది విశేష జ్ఞానం. వృత్తిరహితమైన దశనందుకొంటే అది సామాన్య జ్ఞానం. సామాన్యం గనుకనే అది ఈ శరీర మనః ప్రాణాదులైన ఉపాధుల మేరకే పరిమితం కానక్కరలేదు. ఎంత మనలోపల ఉందో అంత మన వెలపల కూడా ఉండగలదు. బహిరంతశ్చ భూతానా మని తరువాత భగవద్గీతే చెప్పబోతుంది. యావజ్జీవమూ మనకీ విశేష జ్ఞానమే అనుభవ సిద్ధంగదా దీనికతీతంగా మరొక సామాన్య జ్ఞానముందని మనకేమిటి దాఖలా అని సందేహించబని లేదు. ఎందుకంటే అపరిపూర్ణమైన జ్ఞానమిప్పుడు మన అనుభవంలో ఉందంటేనే పరిపూర్ణమైన దొకటి ఉండక తప్పదు. ఒకనిప్పు రవ మన ఒంటిని సోకిందంటే అఖండంగా వెలిగే అగ్నిహోత్ర మొకటి ఉండి తీరాలి. కాబట్టి అపరిపూర్ణ మెప్పుడూ పరిపూర్ణమైన దాని అస్తిత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇదే దానికి ప్రమాణం.
కాబట్టి అపరిపూర్ణమైన మన వృత్తి జ్ఞానానికే గాని దీనికి మూలమైన ఆ పరిపూర్ణమైన సామాన్య జ్ఞానానికి వినాశం లేదు. అది అవినాశి. ఎంచేత యేన సర్వమిదం తతం అది ఈ సమస్త పదార్ధాలనూ వ్యాపించి ఉంది. సమస్తమంటే మాటిమాటికీ చెప్పనక్కర లేదు. మానవుడి అహంకారం Ego దగ్గరి నుంచీ బాహ్యమైన ఆకాశం వరకూ ఈ మొత్తాన్ని వ్యాపించింది. వ్యాప్తి అంటే ఏమనుకొన్నావో. బహిర్వ్యాస్తే గాదు.
Page 80