#


Index

ఆత్మసంయమ యోగము

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన || 43 ||

  మరి ఇలాటి స్థిత ప్రజ్ఞత ఏర్పడాలంటే అది ఇప్పటికిప్పుడేర్పడింది గాదు. ఎన్నో జన్మల నుంచో కృషి చేసి ఉంటే గాని ఆ కృషికి ఫలంగా ఈ జన్మరాదు. ఈ జన్మలో అలాటి ఆలోచనా ప్రవర్తనా రాబోదంటున్నాడు భగవానుడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే. వాడిక జనకుడిలాగా శ్రీమంతుల ఇంట్లో జన్మించనీ జడ భరతుడిలాగా యోగుల ఇంట్లో జన్మించనీ. ఎక్కడ జన్మించాలో అది గూడా కాదు ముఖ్యం. జన్మిస్తూనే వాడలాటి బుద్ధి సంయోగం Mental setup తో జన్మిస్తాడు. ఎక్కడిదా బుద్ధి యోగం. పౌర్వ దైహికం. పూర్వ దేహాలకు సంబంధించింది. అది సంస్కారరూపంగా ఉండిపోయింది. మరణానంతరం వాడు మరలా జన్మ ఎత్తేసరికి నేలలో నాటిన విత్తనం మొలకెత్తినట్టు మళ్లీ అంకురిస్తుంది. వికసిస్తుంది. ఫలిస్తుంది.

  ఫలించాలంటే క్షణాల మీద జరగక పోవచ్చు. యతతేచ తతో భూయః ఈ వర్తమాన జన్మలో మరలా కృషి సాగిస్తాడు. అలా ముందుకు వచ్చిన Brought forward సంస్కారమే పురికొల్పుతుంది వాడిని ఇతోధికంగా ప్రయత్నం సాగించమని. దాని బలంతో ఇంకా దీక్షగా చేస్తూ పోతాడు సాధన. సంసిద్ధి. చేస్తూ పోతే ఎప్పటికైనా ఫలితం సిద్ధించకుండా పోదు. తీవ్ర వేగానా మాసన్న తమః అన్నట్టు తీవ్రంగా

Page 536

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు