
అయినా ఆ భాసగా కనిపిస్తుంది కాబట్టి వాస్తవమని గాక ఆభాస అనే చూపుపెట్టుకొనే వ్యవహరిస్తుంటాడు. ఇటు దేహేంద్రియాదులతో గాని అటు భార్యాపుత్ర మిత్ర గృహరామక్షేత్రాదులతో గాని. మనమిప్పుడొక అద్దంలో మన ముఖం చూస్తున్నా మనుకోండి. ఆ ప్రతి ముఖం చూస్తున్నా అది మన ముఖమే అంతకన్నా వేరే ఏమీ లేదనే దృష్టి వదలకుండానే చూస్తామా లేదా. అలాగే తన ఆత్మ చైతన్యచ్ఛాయే ఈ ప్రపంచమనే భావం తోనే వ్యవహరిస్తుంటాడు జ్ఞాని. భావ మద్వైతం. బాహ్య వ్యవహారం ద్వైతం. భావమే బింబం. బాహ్యం దాని ప్రతిబింబం. అదే ఇలా భాసిస్తున్నదని వ్యవహరిస్తున్నప్పు డిక ఇబ్బంది ఏముంది. సామాన్య విశేషాలు రెండూ తగాదా పడవెప్పుడూ కలిసే బతుకుతుంటాయి. జల తరంగాల లాగా. అలాగే దృగ్దృశ్యాలు రెండూ ఎప్పుడూ పేచీ పడవు. మీదు మిక్కిలవి ఒకేవిధంగా భావిస్తాడు జ్ఞాని.
కనుకనే అంటున్నది గీత. వీక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః - లోపలా వెలపలా అనే తేడా లేకుండా సర్వత్రా సమమైన తత్త్వాన్నే చూస్తుంటాడట యోగి. అందులో సర్వభూతాలలో ఆత్మను చూడటం వల్ల విక్షేప దోషానికి జవాబివ్వగలడు. సర్వభూతాలనూ మరలా ఆత్మలో చూడటం మూలంగా ఆవరణ దోషాని కివ్వగలడు. దృష్టిని మరచి దృశ్యంతో మాత్రమే సంబంధం పెట్టుకొంటే అది విక్షేపం. దృశ్యాన్ని మరచి కేవలం దృక్కును పట్టుకొంటే అది ఆవరణం. ఈ రెండే అవస్థాత్రయం. అందులో ఇదీ ఇందులో అదీ అనటం మూలాన
Page 509
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు