#


Index

ఆత్మసంయమ యోగము భగవద్గీత

  లేకుంటే సరే ప్రశ్న లేదు. కాని మీరెంత లేదని సిద్ధాంతం చేసినా అనుభవంలో ఈ దేహేంద్రియాదులూ - బాహ్యంగా ఈ వస్తువాహనాదులూ కనిపిస్తున్నాయి గదా కనిపిస్తున్న నేరానికి వాటితో అనుక్షణమూ సంవ్యవహారం Transaction తప్పటం లేదుగదా. మరి బ్రహ్మజ్ఞాని అయిన వాడెలా వ్యవహరిస్తాడనే ప్రశ్నకు జవాబేమిటి అని మరలా మొదటికే వచ్చాము. దానికి జవాబొక్కటే. కనిపిస్తున్నా అది ఆ భాస. ఆత్మే అనాత్మ రూపంగా భాసిస్తున్నది. కనుక దాని విభూతే ఈ మొత్తం. అంటే ఆత్మే ఆత్మగా ఉంటూ అనాత్మగా కూడా గోచరిస్తున్నది. ఇదుగో ఈ దృష్టి సడలకుండా ప్రపంచంతో వ్యవహరిస్తుంటాడు జ్ఞాని. అలా వ్యవహరిస్తున్నప్పు డెక్కడి కక్కడ ఆత్మ దృష్టిలో అనాత్మ అనాత్మగా గాక ఆత్మగానే దర్శన మిస్తుంటుంది వాడికి. అదీ వాడి అనుభవం. లోకానుభవాని కిది విలక్షణం. లోకులకూ మిగతా శాస్త్రజ్ఞులకూ ఎవరికీ కూడా ఆత్మ దృష్టి లేదు. ఆత్మ అంటే కర్తా భోక్తాగా కనిపిస్తుంటుంది వారికి. కేవల సాక్షి రూపమైన ప్రత్యగాత్మ వారి కనుభవం లేదు. అంచేత అనాత్మ నాత్మగా చూడలేరు. రెంటికీ తేడా కనిపిస్తుంటుంది వారికి. ఇక్కడ జ్ఞాని దృష్టి అలా కాదు. కేవల సచ్చిద్రూపమది. సచ్చిత్తులు తనలోనే గాక తాను చూచే ప్రతి పదార్దంలోనూ ఉన్నాయి. అందుకే వాటిని సామాన్యమన్నారు. ఈ సామాన్యాన్ని పట్టుకొన్నాడు జ్ఞాని. కనుక తన్నూ సచ్చిదాత్మకంగానే చూస్తాడు. తాను చూచే ప్రపంచమూ తద్రూపంగానే చూస్తాడు. ఆత్మా నాత్మలకు సరిహద్దు రేఖ చెరిగిపోయి రెండూ ఏకంగా కనిపిస్తాయి వాడికి.

Page 508

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు