#


Index

ఆత్మసంయమ యోగము

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః |
నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ || 11 ||

  పోతే ఇప్పుడు యోగాభ్యాసం చేసే సాధకుడెలాటి ఆసనం వేసుకోవాలి ఆహారమెలాటిది సేవించాలి ఎలా విహారం సాగించాలి - అనే సాధన నియమాలను వర్ణిస్తున్నాడు మహర్షి. అంతే కాదు. యోగం సిద్ధిస్తే దాని లక్షణమెలా ఉంటుంది వాడికి కలిగే ఫలితమెలాటి దనే విషయం కూడా చెప్పబోతాడు. ప్రస్తుత మాసనమెలా ఉండాలో వర్ణిస్తున్నాడు. ఆసనమంటే కూచునే పద్ధతి Posture. Position అది స్థిరంగా ఉండాలట. స్థిరసుఖ మాసనమని పతంజలి కూడా చెబుతాడు. స్థిరమంటే నిశ్చలం. నిశ్చలంగా ఉండాలి. అలా ఉన్నప్పు డిబ్బంది కలగకూడదు సుఖంగా అనిపించాలి That which is stable and comfortable.

  నిశ్చలంగా సుఖంగా ఉండవలసిందేది ఇంతకూ శరీరం. అది మొదట శుచౌ దేశే ప్రతిష్ఠాప్య. శుచీ శుభ్రమైన ప్రదేశం చూచుకొని అక్కడ నిలుపుకోవాలి. ఆ ప్రదేశం సహజంగానైనా కావచ్చు. లేక శుద్ధి చేసినదైనా కావచ్చు. మొత్తం మీద వివిక్తంగా పరిశుభ్రంగా ఉండాలి. అలాంటి చోటనే ప్రతిష్ఠాప్య - నిలుపుకోవాలి శరీరం. నిలుపుకోటమంటే మరలా ఎలాగంటే అలా కాదు. నాత్యుచ్ఛితం నాతినీచం. అంత నిటారుగా కాదు. అలాగని మరీ అంత కుంచించుకొనీ కాదు. వెన్నెముక వంగకుండా కదలకుండా కూచుంటే చాలు.

Page 472

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు