
>
అప్పుడు యతేంద్రియ మనోబుద్ధిః - బాహ్యంగా వీటి నేకాగ్రం చేయగలిగితే మనసూ బుద్ధీ ఇంద్రియాలూ ఇవి కూడా అదుపులోకి వచ్చి నిశ్చలమయి పోతాయి. బయటా లోపలా ఏ వృత్తీ ఉదయించదు. ఇదంతా ఎందుకీ కసరత్తంటే మునిర్మోక్షపరాయణః - మోక్షమనే ప్రయోజనాన్ని సాధించటానికి దాని కిదంతా పూర్వరంగం - Preparation ఇది మౌనానికి దారితీస్తే అది మోక్షానికి మార్గం చూపుతుంది. ముని భావమే మౌనం. మననం చేసేవాడే ముని. ఆత్మ స్వరూపాన్ని నిరంతరమూ భావన చేయటమే మననం. అదే బ్రహ్మాకార వృత్తి - అదే జ్ఞానం. అది కలిగిందో ఇక వాడు ముక్తుడే. సదా ముక్త ఏవ సః ఎందుకంటే వాడికెప్పుడూ సమమైన బ్రహ్మమే కనిపిస్తుంటుంది. సమ మన్నప్పు డిక విషమమనే మాట లేదు. ఏమిటా విషమం. ఇచ్ఛా భయక్రోధాలు. ఇచ్ఛా క్రోధాలంటే రాగద్వేషాలే. అవే నీకు సమమైన తత్త్వాన్ని విషమంగా చూపుతుంటాయి. దానివల్లనే భయం కూడా. సంసారమంటే భయమే గదా మరి. భయం దేనివల్ల వైషమ్యం వల్ల. అది దేనివల్లా. రాగద్వేషాల వల్ల. అది ఎలా పోవాలి. సమదర్శనం వల్లనే పోవాలి. అదే బ్రహ్మాకార వృత్తి. ఇదీ ఇందులో ఉన్న ఆంతర్యం.
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ |
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి || 29 ||
అందుకే జ్వాత్వా అంటున్నది గీత జ్ఞానమే ప్రమాణం. దానితోనే పట్టుకోవాలి జ్ఞేయమైన బ్రహ్మాన్ని. ఎలా ఉంటుందా బ్రహ్మమనే జ్ఞేయం. భోక్తారం యజ్ఞతపసాం - యజ్ఞమంటే ఇక్కడ కర్మ. తపస్సంటే జ్ఞానం. యస్య జ్ఞాన మయం తపః అన్నది ముండకోపనిషత్తు. మరి యజ్ఞమంటే
Page 443
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు