గదా వాడే చూస్తాడని చెప్పటమేమిటి. మనమూ చూస్తున్నాము నిజమే. కళ్లతో చూస్తున్నాము మనము. చూస్తే ఏమి కనిపిస్తుంది. ఈ ప్రపంచం. అది ఆనాత్మే గాని ఆత్మ గాదు. మరి ఆత్మ ఏమిటి. సత్సామాన్యం. అంతా అలికేసినట్టు ఆకాశంలాగా నిరాకారంగా వ్యాపకంగా కనపడాలి. అదీ సామాన్యం. ఇది ఫలానా అది ఫలానా అని విశేషంగా కనపడగూడదు. అలాంటప్పుడది జ్ఞానం ఇది కర్మ అది అచలం ఇది చలనం అని తేడా ఎలా చూడగలిగావు. అలా చూస్తే అది చూపుగాదు మాదృష్టిలో. ఫలానా అని విశేషాకారంగా కాక అన్ని విశేషాలనూ కరగదీసి సామాన్యంగా మార్చుకొని ఏకంగా చూడాలి. అదే మేము చూపని చెప్పటం. నిర్వికల్పమైన దృష్టి ఇది. లోకులు భావించే సవికల్ప దృష్టి కాదు. ఫలైకత్యాత్ సపశ్యతి సమ్యక్పశ్యతి అని అర్ధం వ్రాస్తున్నారు గురువుగారు. మార్గంలో రెండుగా కనిపించినా ఫల సిద్ధిలో ఏకమే కర్మ జ్ఞానాలు.
ఇక్కడ ఇంకొక సూక్ష్మమున్నది మనం గుర్తుంచుకోవలసింది. లోకే స్మిన్ ద్వివిధానిష్ఠా జ్ఞాన యోగేన సాంఖ్యానామ్ - కర్మ యోగేన యోగినా మని ఇద్దరికీ రెండు విభక్తం చేసి చెప్పాము మార్గాలని ముందు వర్ణించాడు భగవానుడు. ఇప్పుడేమో రెండు కావవి రెండూ ఒకటిగా చూడాలంటు న్నాడు. రెండు మాటలూ ఒకదాని కొకటి విరుద్ధంగా లేవా అనిపించవచ్చు. విరుద్ధంకావు వాస్తవం. ఎందుకంటే ఉపాయంగా ఒకటి ఉపేయంగా ఒకటీ చెప్పాడక్కడ. అందుకోసం రెండుగా వేరు చేసి చూపవలసి వచ్చింది.
Page 384