#


Index

కర్మసన్యాస యోగము

నిర్ద్వం ద్వోహి. అసలే ద్వంద్వాలూ లేవు వాడికి. సుఖదుఃఖాలూ లాభనష్టాలూ - పుణ్యపాపాలూ మా నావమానాలూ. ఇలాటి వేవీ వాడు దరిదాపులకు రానీయడు. అయితే ఎలా బ్రతుకుతాడని అడుగుతావా. ప్రారబ్ధవశాత్తూ ఎప్పుడేది లభిస్తే దానితోనే జీవయాత్ర సాగిస్తుంటాడు. అందని మ్రాని పండ్ల కర్రులు చాచడు. చేతికందిన దానిని జారవిడవడు. యదృచ్ఛా లాభ సంతుష్టుడు వాడు.

  ఇది కర్మయోగ మిచ్చిన బలం వాడికి. కనుకనే వాడు యోగే గాక సన్న్యాసి కూడానని ప్రశంసిస్తున్నది గీత. ప్రశంస మాత్రమే గాదు. యధార్ధం కూడా. ఎందుకంటే ప్రశంస మాత్రమే అయితే ఫలితం కలుగుతుందని గారంటీ లేదు. నీ వింద్రుడు చంద్రుడన్నంత మాత్రాన ఆ రాజుగా రింద్రుడూ కాడు చంద్రుడూ కాడు. కేవల మది పొగడ్త మాత్రమే. అలాంటిది కాదిక్కడ ఫలితం కూడా కలిగి తీరుతుంది. ఏమిటది. సుఖం బంధా త్ప్రముచ్యతే. సంసార బంధం నుంచి అనాయాసంగా బయటపడతాడు వాడు. కర్మయోగం సత్త్వశుద్ధి నిస్తే అది కర్మఫల సన్న్యాసానికి దారితీస్తే - తద్ద్వారా ఏకాగ్రత ఏర్పడితే - దానివల్ల శ్రవణ మననాదులు సాగిస్తే చివర కన్నింటికీ పర్యవసానంగా మోక్ష సామ్రాజ్యానికే పట్టాభిషిక్తుడు కాగలడు. కనుక నిత్యసన్న్యాసి కర్మయోగేనని జ్ఞేయః గ్రహించాలి మనం.

Page 379

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు