కర్మసన్యాస యోగము
భగవద్గీత
కర్మలను వదిలేయటం కాదు నీవు చేయవలసింది. చేసే ప్రతి కర్మా నేను గాదు చేయటమని కర్తృత్వాన్ని వదిలేసి చేస్తుండు. అలాగే ఫలితం నాకు తప్పకుండా ప్రాప్తించాలనే భోక్తృత్వాన్ని కూడా మానేసి చేయి. అప్పుడా కర్మ యోగంగా మారి నీకు చిత్తశుద్ధి ద్వారా మోక్షఫలాన్నే ప్రసాదిస్తుంది. కనుక సన్న్యాసం కన్నా యోగం మేలు. తెలియక చేసే సన్న్యాసం కంటే తెలిసి చేసే యోగం నీకు ఫలప్రదం. ఇదీ పరమాత్మ బోధ మనకు.
జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి |
నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే || 3 ||
అసలు సన్న్యాసమనే భావమింత దూరం వివరించి చెప్పినా ఇంకా మనలో చాలామందికి జిడ్డు వదలటం లేదు. పరిత్యాగమే సన్న్యాసమనే భ్రాంతిలో ఉన్నారు. విషయం తెలియకుండా పరిత్యజించి పోతే మాత్రం ప్రయోజన మేముందని ఆలోచించరు. చెబుతున్నది వినండి భగవద్గీత. జ్ఞేయస్స నిత్య సన్న్యాసీ. వదిలేసి పోయేవాడు గాదట సన్న్యాసి. వాడు సన్న్యాసేగాని నిత్య సన్న్యాసి కాడు. కాషాయం కట్టినా కట్టకున్నా కర్మ మానేసినా చేసి నా నిత్యమూ సన్న్యాసి అనిపించుకొనే మహానుభావు డొకడున్నాడు. ఎలా ఉంటాడు వాడు.
యోన ద్వేష్టి న కాంక్షతి. వాడొకరిని ద్వేషించడు ఒకరిని ప్రేమించడు. ఒకటి కావాలని కోరడు. అక్కరలేదని త్రోసి పుచ్చడు రాగద్వేషాలు లేవు వాడికి. రాగద్వేషాలనేవి ఉపలక్షణం ద్వంద్వాల కన్నిటికీ.
Page 378