#


Index



జ్ఞాన యోగము

  అయితే జ్ఞానం పూణ్యపాప కర్మలన్నింటినీ దగ్ధంచేస్తుందని గదా వర్ణించారు. అది ఎలా చేస్తుందని అడిగితే వివరిస్తున్నారు వ్యాస భట్టారకులు. జ్ఞాన మనేది ఒక బ్రహ్మాండంగా మండుతూ ఉన్న అగ్ని హోత్రం బాగా మండుతున్న అగ్ని జ్వాల ఎన్ని దుంగలనూ దూలాలనూ దానిలో పడేసినా ఎలా కాల్చి భస్మం చేయగలదో అలాగే ఈ ప్రజ్వలించే జ్ఞానాగ్ని కూడా కర్మలనే సమిధల నెన్నిటినైనా కాల్చి బూడిద చేయగలదు.

  జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కురుతే అన్నారు బాగానే ఉంది. కర్మలను జ్ఞానం భస్మం చేస్తుందంటే ఎలా చేస్తుందది. కట్టెల లాగా కర్మలనేవి కనపడవు గదా. నిజమే. భస్మం చేయట మంటే ఇక్కడ కర్మలను కాల్చి పారేయటం. బీజాలు మరలా మెలకెత్త కుండా వాటి శక్తిని లాగేయటమని అర్థమట. ఒక పొట్ల విత్తనమో జొన్న విత్తనమో నేలలో నాటితే ఎప్పటికైనా మొలకెత్తుతుంది. దాన్నే బాణలిలో వేసి వేయిస్తే ఇక మొలకెత్తదు. మొలకెత్తే స్వభావం పోతుంది దానికి. అలాగే సంచిత కర్మ- ఆగామికర్మా - మరలా జన్మ అనే అంకుర మేర్పడ కుండా జ్ఞానోదయ మయ్యేసరి కభావమయి పోతాయి. అంటే జ్ఞానంలోనే చేరి జ్ఞాన స్వరూపంగా మారి పోతాయి. అలాంటప్పుడిక పునర్జన్మ అనే అంకురోత్పత్తి కవకాశమేది. ఇదీ దీనితాత్పర్యం.

  సరేగాని జ్ఞానికి సర్వకర్మలూ తొలగి పోతే శరీరమనే ఉపాధీ దానితో చేసే కర్మా ఏమయిందని ప్రశ్న. దానికి జవాబిచ్చారు భాష్యకారులు.

Page 358

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు