ప్రాణాయామ ప్రత్యాహా రాదికమైన యోగాభ్యాసమే యజ్ఞం వారి పాలిటికి. మరికొందరైతే స్వాధ్యాయ మొకటీ. జ్ఞానమొకటీ ఇవే యజ్ఞానుష్ఠానమని తలపోస్తారు. ఋగాది శాఖలలో ఏదో ఒక శాఖను అధ్యయనం చేస్తూ పోవటం స్వాధ్యాయ యజ్ఞం. పోతే తామభ్యసించే శాస్త్రం తాలూకు అర్ధమేమిటో దాని పరిజ్ఞానం గడిస్తే అది జ్ఞానయజ్ఞం.
వీరందరూ యతయః సంశిత వ్రతాః - యతులు. యతన మంటే ప్రయత్నం. వారు వారు పట్టుకొన్న మార్గాలలో చక్కగా పరిశ్రమ చేస్తుంటారు. అంతేగాక సంశితవ్రతాః చాలా పదునైన తీవ్రమైన సంయమంతో అనుష్ఠిస్తుంటారా యజ్ఞాన్ని వారు. Method in madness అన్నారు. తాము చేసేది యజ్ఞమా కాదా అని గాదు. యజ్ఞమనే నమ్ముతున్నారు. తమ నమ్మకాని కనుగుణంగా నడుచుకొంటున్నారు నిజాయితీగా. అందులో ఎలాటి భేషజం లేదు. మోసం లేదు.
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే |
ప్రాణాపానగతీ రుద్ధ్వా ప్రాణాయామపరాయణాః || 29 ||
ఇంకా కొందరు పాటించే యజ్ఞ మెలాంటిదో వర్ణిస్తున్నది గీత. అపానం ప్రాణమని ఉన్నాయి రెండు. ప్రాగ్గ మనవాన్ ప్రాణః - అర్వాగమన వానపానః అని వాటి నిర్వచనం. బయటికి పోయేగాలి ప్రాణం లోపలికి వెళ్లేగాలి అపానం. అంటే ఉచ్ఛ్వాసనిః శ్శ్వాసాలు. అందులో
Page 339