#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే || 27 ||

  సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి - పంచేంద్రియాలూ తమ తమ వ్యాపారాలు సాగిస్తూనే ఉంటాయి. అవి ఇంద్రియ కర్మలు. అలాగే ప్రాణకర్మ లున్నాయి. ఆకుంచన ప్రసారణ గమనా దానాది క్రియలు. వీటన్నిటినీ కొందరు ఆత్మ సంయమ యోగాగ్నౌ ఆత్మ నిగ్రహమనే యోగమే ఒక హోమకుండంగా భావించి అందులో లయం చేయటానికి యత్నిస్తుంటారు. జ్ఞాన దీపితే ఇలా చేస్తున్నామనే జ్ఞానంతో బుద్ధిపూర్వకంగా చేస్తుంటారు. జ్ఞానమే వారి బుద్ధి కా ప్రకాశాన్ని అందిస్తుంది. అలా చేయటమే వారికొక యజ్ఞం.

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః || 28 ||

  కొందరైతే ద్రవ్య యజ్ఞం చేశామని సంతోషిస్తుంటారు. తీర్ధ క్షేత్రాదులలో పాత్రులైన వారికి పదిమందికి యజ్ఞమనే పేరుతో ద్రవ్యాన్ని వినియోగించటం ద్రవ్యయజ్ఞం. మరికొందరు తపోయజ్ఞ మాచరిస్తుంటారు. తపస్సంటే కృచ్ఛ చాంద్రాయణాదులు. కాయశోషణం ఇంద్రియ శోషణం నిరాహార దీక్షా ఇలాంటిదంతా తపస్సు - అదే ఒక యజ్ఞమని భావిస్తారు వారు. ఇంకా కొందరు యోగయజ్ఞం చేస్తుంటారు.

Page 338

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు