#


Index

కర్మ యోగము

  అంచేత ఇంతకూ చెప్పవచ్చే దేమంటే నీవు కర్మిష్ఠుడవా కర్మయోగివా - జ్ఞానివా - ఎవడవో తేల్చుకో మొదట. నా దృష్టిలో నీవు కేవలం కర్మిష్ఠుడవే. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అన్నట్టు నీసంగతి నాకు తెలియదా. యోగానికే ఎదగలేదు నీవింకా. జ్ఞానమెలా ఆసించగలవు. జ్ఞానవిషయం నేనెంత వర్ణించినా నీకది అప్పుడే వచ్చి ఒళ్లో పడదు. అది నీవందుకో వాలంటే ముందు దానికి కావలసిన శిక్షణ పొందాలి నీవు. అది ఏదో గాదు. కర్మయోగం.

  అంచేత ఏమిటా అందరికీ జ్ఞానం చెప్పి నాకు మాత్రమే కర్మ చెప్పి ఘోరమైన కర్మక్షేత్రంలో పారేస్తున్నాడా ఈ పెద్దమనిషి అని నీవు నన్ను ఆక్షేపించనక్కర లేదు. నేను నీకు మంచే చేస్తున్నాను. చెడ్డ చేయటం లేదు. కేవల కర్మ చెబితే చెడ్డే. అది జ్ఞానాని కుపకరించదు. జ్ఞానానికి తోడ్పడే కర్మయోగం బోధిస్తున్నాను. ఇప్పటికి నీ యోగ్యతను బట్టి నీకు నేను బోధించ వలసింది అదే.

  తస్మా దసక్త స్స తతం కార్యం కర్మ సమాచర - కర్మ చేస్తూ ఉండు. కాని ఏది కర్తవ్యమో అదే చేయి. కామ్యనిషిద్ధాలు వదిలేసి నిత్యనైమిత్తికాలే పాటిస్తూ పో. అది కూడా ఫలితాన్ని ఆసించకుండా అనాసక్తితో అనుష్ఠించు. ఫలకామనే నిన్ను దెబ్బ తీస్తుంది. అది నీకోసమని చూడకు. ఈశ్వరార్పణ బుద్ధితో అసక్తో హ్యాచరన్ కర్మ. స్వార్ధ బుద్ధి లేకుండా చేశావంటే పరమాప్నోతి పూరుషః - ఎప్పటికైనా సత్త్వం శుద్ధి అయి జ్ఞానం సంపాదించి చివరకు మోక్షమే పొందగలవు.

Page 240

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు