కర్మ యోగము
భగవద్గీత
నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన |
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః || 18 ||
ఇదం సర్వం యదయ మాత్మా అని సర్వమూ వాడి దృష్టి కాత్మగానే సాక్షాత్కరించి నప్పుడిక నైవ తస్యకృతే నార్ధః ఒక కర్మ ఆచరించటం వల్ల వాడాసించే ప్రయోజనమేదీ లేదు. నాకృతే నేహ కశ్చన. అలాగే ఒక పని చేయ నందువల్ల మోసం లేదు. అంటే ప్రత్యవాయాది దోషాలు అంటవు. కర్మష్ఠుడి కైతే విహిత కర్మలు చేయకపోతే అంటుతుందది. అలాగే కర్మయోగికైనా నిష్కామంగా కర్మ పాటించకపోతే జ్ఞానప్రాప్తి అనే ప్రయోజనం కలగకుండా పోతుంది. ఆ రెండు దశలూ దాటి మూడవ స్థాయి కెదిగినవాడు కాబట్టి జ్ఞానికటు హానీ లేదు. ఇటు లాభమూ లేదు.
అంతేకాదు. న చాస్య సర్వభూతేషు కశ్చి దర్థ వ్యపాశ్రయః - స్థావర జంగమాలలో దేనిని గాని ఒక ప్రయోజనం సాధించటాని కాశ్రయించ వలసిన అవసరం కూడా లేదు వాడికి. అలాటి అవసరమే కొంచెమున్నా దాని కోసమొక పనిపెట్టుకోక తప్పదు. అంతా బ్రహ్మమని అది తనస్వరూపమనే అభేద భావమెప్పుడూ ఎక్కడబడితే అక్కడ సర్వత స్సంప్లు తోదకంగా చూస్తున్నవాడి కెవరితో గాని దేనితో గాని అవసర మేముంది.
అది కూడా వాడి స్వరూపం కన్నా వేరుగా లేదు గదా.
తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర |
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః || 19 ||
Page 239