కర్మ యోగము
భగవద్గీత
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి || 20 ||
కర్మ అనగానే నీవు లిక్కి పడతావేమిటి - తక్కువగా భావిస్తావేమిటి. కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః - పూర్వం జనకా శ్వపత్యాది సుక్షత్రియు లందరూ కర్మ యోగంతోనే తరించారు. సమ్యగ్దర్శన మనేది చిత్తశుద్ధి వల్ల గాని రాదు. అది కర్మయోగం వల్లగాని ఏర్పడదు. అలా సాధించిన వారే వారంతా.
అలా సాధించి సిద్ధులైన తరువాత కూడా వారుకర్మ మానుకోలేదు. లోక సంగ్రహమే వాపి సంపశ్యన్- లోక సంగ్రహమని ఒకటున్నది. లోకులు దారి తప్పి పెడదారి తొక్కుతుంటే వారిని దారిలో పెట్టటానికి లోకసంగ్రహమని పేరు. సాధన మార్గ ముపదేశించి లోకోద్ధరణ చేయాలన్న మాట. నేను సిద్దుడ నయ్యానిక నా కితరులతో పనేముందని ఊరక కూచోరాదు. స్వయం తీర్ణః పరాంస్తారయతి అన్నారు. తాను తరించి మరొకరిని తరింపజేయాలి. దీని కధికారమని Deputation అలాంటి వారి కాధికారిక పురుషులని పేరు. అలాంటి వారే జనకాదులు. మరి ఇంతకు ముందు చెప్పినవారో. వారు ఆత్మారాములు. వారికి లోకంతో పని లేదు.
ఏదైనా ప్రారబ్ధాధీనం మన జీవిత వ్యవహారం. ప్రారబ్ధమెలా తిప్పితే అలా నడుస్తుంటుంది. కొందరి కితరుల నుద్ధరించే పనిచెబుతుంది. మరికొందరి కాత్మోద్ధరణ చాలు ఏకాంతంగా బ్రతకమని సలహా నిస్తుంది.
Page 241