కర్మ యోగము
భగవద్గీత
మొత్తం మీద ఇద్దరూ సిద్ధపురుషులే. గోవింద భగవత్పాదులు ఆత్మారాములైతే శంకర భగవత్పాదు లాధికారికులు. ఆ గురుశిష్యులలోనే చూస్తామీ రెండు తెగలూ. ఇలాటి వారే జనకాది రాజన్యులు. కాబట్టి నీవు కూడా సాధకుడవైనా చేయవలసి ఉంటుంది కర్మ. సిద్ధుడవైనా చేయవలసి ఉంది. కర్మ చేస్తే చెడిపోతామే పడిపోతామే అనే భీతాహ ముండ గూడదు నీకు. అంతా ఆత్మకోస మాత్మ స్వరూపమేననే భావమున్నప్పుడు పడే దేముంది. చెడే దేముంది. కర్మ లేక పోయినా యోగంగా ఆచరిస్తూపో.
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్ తదేవేతరో జనః |
స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే || 21 ||
అయితే లోక సంగ్రహ మన్నారే. అది ఎందుకు పెట్టుకోవాలి సాధకుడు. వాడి పాటికి వాడు సాధన చేస్తూ పోవచ్చు గదా. ఇతరుల జోలి దేనికి అని ప్రశ్న వస్తే దానికి సమాధాన మిస్తున్నాడు. యద్యదా చరతి శ్రేష్ఠ స్తత్తదేవేతరో జనః - ఉత్తముడైన మానవుడేది మార్గమని నడిస్తే అదే మార్గంలో ఇతరులు కూడా నడుస్తారు. స యత్ప్రమాణం కురుతే లోక స్తదను వర్తతే - అంతేకాదు. వాడేది ఆదర్శంగా చూపుతాడో లోకాని కదే జీవిత గమ్యమని భావించి లోకులు దాని వైపే పయనిస్తారు కూడా.
ఇది మానవ మనస్తత్త్వాన్ని ఎంతో మధించి వ్రాస్తున్నాడు. వ్యాసమహర్షి గతాను గతికో లోకః - లోకమొక గొట్టె దాటు. ఎవరేది చేస్తే అది చేస్తుంది. చాలా వరకు మూఢుడీ మానవుడు. స్వతంత్ర ప్రజ్ఞ లేదెవరికీ. అది కనిపెట్టి వారిని చెడ్డమార్గంలో ప్రవేశ పెడతా డొక్కొక్కడు.
Page 242