మూలమని ఆఖరి ప్రశ్న. బ్రహ్మాక్షర సముద్భవం. అక్షరం నుంచి వచ్చింది వేదమని సమాధానం. అక్షర మేమిటి. క్షరం కానిదేదో అది అక్షరం. పరమాత్మ తత్త్వమని అర్ధం. పరమాత్మే అన్నిటికీ పరాయణం Culmination సాకాష్ఠా సా పరా గతిః అని చాటుతున్నది కఠోపనిషత్తు.
పరమాత్మ అన్నప్పుడిక ప్రశ్నలేదు. ఎందుకంటే అది సర్వవ్యాపకం. సర్వ వ్యాపకం పరమాత్మా లేక వేదమా అని మరలా ఒక సందేహ మేర్పడుతున్నది. ఎందుకంటే తస్మా త్సర్వగతం బ్రహ్మ అని ఒక వాక్యమిప్పుడు వినిపిస్తున్నది. వేదమే సర్వవ్యాపకమెలా అయింది. తస్య నిశ్వసి తం వేదాః పరమాత్మ నిః శ్వాసమే వేదమని గదా ఉపనిషత్తు చాటుతున్నది. దీనికిప్పుడు సంజాయిషీ ఇస్తున్నారు భాష్యకారులు వినండి.
యస్మాత్సాక్షా త్పరమాత్మాఖ్యాత్ అక్షరాత్ పురుష నిః శ్వాసవ త్సముద్భూతం బ్రహ్మ - తస్మాత్ సర్వార్ధ ప్రకాశ కత్వా త్సర్వగతం. సర్వగతమైన పరమాత్మ నుంచి జన్మించి సర్వవిషయాలనూ అలాగే ప్రకాశింప జేస్తుంది గనుక వేదం కూడా సర్వగతమని సమర్ధించా రాయన. ఎప్పుడిలా సర్వగత మయిందో నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యమూ యజ్ఞక్రియ నాశ్రయించి ఉందట వేదం. యజ్ఞాన్ని ఆశ్రయించట మేమిటి యజ్ఞ విధి ప్రధానత్వా త్తంటాడు. యజ్ఞ విధానమే దానికి ప్రధానమట. కర్మ ప్రధానం వేదమని భావం.
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః |
అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి || 16 ||
Page 230