#


Index

సాంఖ్య యోగము

స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ |
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ || 54 ||

  అయితే ఇప్పుడిలాటి సమాధి ప్రజ్ఞ ఒక యోగికి కలిగిందో లేదో కలిగిన ఆ స్థిత ప్రజ్ఞుడి లక్షణాలెలాటివి అవి మనమెలా గుర్తించగలమని అర్జునుడు గురువు గారిని ప్రశ్నిస్తున్నాడు. స్థిత ప్రజ్ఞస్య కాభాషా అని. ఇక్కడ ఈ శ్లోకంలో నాలుగే నాలుగు ప్రశ్నలున్నాయి. కాభాషా - కిం ప్రభాషేత - కిమాసీత - వ్రజేత కిమ్మని. ఇతరులు ఆ స్థిత ప్రజ్ఞుణ్ణి ఏమని పిలుస్తారు. వాడే స్వయంగా ఏమి మాటాడుతాడు ఎలాగంటాడు. ఏది పొందుతాడు. ఇవీ ఆ నాలుగు ప్రశ్నలూ.

  ఇంతకూ నాలుగింటికీ జవాబు వస్తే అది ఆ స్థిత ప్రజ్ఞుడి లక్షణం క్రిందికి వస్తుంది. ఇక్కడ ఒక వివరణ ఇస్తున్నారు భగవత్పాదులు. ఎవడైతే మొదటినుంచీ కర్మల వైపు మొగ్గు చూపక ఆత్మజ్ఞానమే జీవిత లక్ష్యంగా పెట్టుకొని అందులోనే కాలం గడుపుతుంటాడో వాడూ స్థిత ప్రజ్ఞుడే. అలాకాక చాలాకాలం కర్మయోగ మవలంబించిదాని ఫలితంగా చివరకు జ్ఞానం సంపాదించి అందులో స్థిరపడతాడో వాడూ స్థితప్రజ్ఞుడే. ఒకడు Direct అయితే - ఇంకొకడు Department promotion తో పైకి వచ్చిన ఉద్యోగి అని ఎప్పుడూ చెబుతూ ఉంటాను. ప్రజహాతి యదా అని ఇప్పుడు రాబోయే శ్లోకం దగ్గరి నుంచీ ఈ అధ్యాయం పరిసమాప్తమయ్యే వరకూ ప్రతి ఒక్క శ్లోకంలో స్థిత ప్రజ్ఞ లక్షణమూ వర్ణిస్తారు. సాధనమూ వర్ణిస్తారు వ్యాసభగవానులు.

Page 161

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు