#


Index

సాంఖ్య యోగము

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతమ్ |
తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి || 26 ||

   ఇంత నచ్చచెప్పినా శాస్త్రం - మనకింకా జిడ్డు వదలలే దనుకోండి. శరీరమే ఆత్మ అంతకన్నా అతీతంగా ఎక్కడా లేదనే భావంతో బ్రతుకున్నా మనుకోండి. దీని కభ్యుప గమ వాదమని పేరు పెట్టింది శాస్త్రం. నిజంగా ఆత్మ శరీర మయిందని కాదు. ఒకవేళ అలాగే భావించా మను కోండి. అప్పటికీ మరణ భయం నీవు పెట్టుకోట మవివేకమే నని చాటుతున్నా డిప్పుడు పరమాత్మ.

  అధ చైనం నిత్యజాతం - నిత్యం వామన్యసే మృతం - నిత్యమూ జన్మిస్తూనే ఉన్నావు. నిత్యమూ మరణిస్తూనే ఉన్నావు. ఒక శరీరం వచ్చింది నీకు. దాన్ని జన్మ అంటున్నావు. ఆ శరీరం పోయింది. దాన్ని మరణమన్నావు. అది పోయి మరొక శరీరం వచ్చింది. దాన్ని మళ్లీ జన్మ అన్నావు. ఇలా శరీరాలు పోతూ వస్తూ ఉన్నప్పుడు ఇక నీకు భయమెందుకు. ఎప్పుడూ ఇలా శరీరంతోపాటు పుట్టాన ననుకొంటూ దానితోపాటు పోయా ననుకొంటూ మళ్లీ అది పుడితే నేను పుట్టానని భావిస్తున్నావు గదా. అలాంటప్పు డశరీరమని ఆత్మను భావించి జనన మరణాలు దానికి లేవని ఎలా బాధపడవో - అలాగే సశరీర మని భావించి జనన మరణాలు దానికే కలుగుతున్నా యనుకొన్నా బాధేముంది నీకు. నిత్యమూ జనన మరణా లేర్పడుతూనే ఉన్నప్పు డెక్కడికీ పోవటమూ లేదు రావటమూ లేదు.

Page 104

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు