అందుచేత మనః ప్రాణాలకది విలక్షణం. ప్రాణమనేది వాయుతత్త్వమే గదా. వాయువు దానిమీద పనిచేయదని ఇంతకుముందే పేర్కొన్నాము కాబట్టి తద్వికారమైన ప్రాణం సంగతి వేరే చెప్పనక్కరలేదు. పోతే అచింత్యమన్నారు కాబట్టి మనస్సు సంగతీ తేలిపోయిందిప్పుడు. దీనివల్ల స్థూల శరీరమే కాక సూక్ష్మశరీరంతో కూడా సంసర్గం లేదని చెప్పటమయింది. మనః ప్రాణాలే గదా సూక్ష్మ శరీరం.
పోతే అజ్ఞాన మనే కారణ శరీరమొక్కటి మిగిలిపోయింది. అవి కార్యోయ ముచ్యతే అనటం మూలంగా అది కూడా కాదాత్మ అని తేట పడుతున్నది. వికారమంటే మార్పు. నిరాకార నిశ్చలం జ్ఞాన స్వరూపమని ఎప్పుడన్నామో అప్పుడాత్మ కెలాటి వికారమూ ఉండటానికి లేదు. అజ్ఞానమనే వికార ముండ వచ్చు గదా అని అడిగితే అదీకాదని చెబుతున్నాడు. తస్మా దేవం విదిత్వా అని. దాన్ని అఖండ జ్ఞాన స్వరూపమే నని గుర్తించగలిగితే అది కూడా లేదని. ఎలాగా. దాన్ని జ్ఞానమని గుర్తించే దెవరు. అదేగదా. అది జ్ఞానం కాక పోతే తన్ను తాను జ్ఞానమని గుర్తించగలదా. కాబట్టి అజ్ఞానమనే కారణ శరీరం కూడా కాదది. అశరీరం. అశరీర మెప్పుడయిందో భౌతికం కావటానికి వీలుకాదు. కాకపోతే ఇక దానికి జనన మరణాదుల గంధం కూడా లేదు. ఎప్పుడూ ఉన్న పదార్ధం. పదార్ధం కాని పదార్ధం. ఆత్మ పదార్ధం Subjective Entity. అలాంటప్పుడు వారు పోయారే పోతారే అని శోకించటం దేనికి. అనవసరం. నాను శోచితు మర్హసి.
Page 103