వీరిదొక పెద్ద సంకేతం. ద్వారపాలకులంటే రజస్తమోగుణాలే. అవి మోక్షద్వారాన్ని పాలిస్తున్నాయి. ఎంత వాళ్లనూ లోపలికి వెళ్లనీయవు. పరమాత్మ దర్శనానికి నోచనీయవు. అయితే శుద్ధ సత్త్వసంపన్నులయి బ్రహ్మ జ్ఞాన నిష్ఠులైన పెద్దల నవి ఏమీ చేయలేవు. వాటి కబంధ హస్తాల కందని ప్రదేశంలో ఉన్నారు వారు. అలవాటు కొద్దీ ఎప్పుడైనా వారి మీద దాడి చేశాయో ఇవి బ్రతకలేవు. అంటే ఏమని అర్థం. జ్ఞానక్షేత్రంలో అడుగుపెడితే రజస్తమో గుణాత్మకమైన అవిద్య నశించవలసిందే తప్పదు. అప్పుడది పరమాత్మకు దూరమై పోతుంది. అయితే అది ఆయన మాయాశక్తే కాబట్టి ఎప్పటికీ దూరం కావటమాయన కిష్టం లేదసలు. మరలా ఏదో ఒక నెపంతో తన దగ్గరికి రావలసిందే. అజ్ఞానులను తదాశ్రయ బలంతో అవి పట్టి చూడవలసిందే. కాబట్టి జయ విజయులంటే రజస్తమస్సులే. కనుకనే వారు తమ శాపఫలంగా ఎత్తిన మూడు జన్మలలోనూ ఆ గుణప్రభావాన్ని చూపుతూనే వచ్చారు. హిరణ్యకశిపుడు రజోగుణానికైతే హిరణ్యాక్షుడు తమోగుణానికి ప్రతీక. అలాగే రావణుడు రాజసుడైతే కుంభకర్ణుడు తామస స్వభావుడు. శిశుపాలుడిది రాజస ప్రకృతి అయితే దంత వక్త్రుడిది మరలా తామసతత్త్వం. ఇలా వారి జన్మలలోనే మనకా గుణభేదం కనిపిస్తుంది.
విదుర మైత్రేయ సంవాదం తరువాతదీ స్కంధంలో కపిల దేవహూతి సంవాదం. కర్ధము డొక ప్రజాపతి. అతడు పెండ్లి ఆడింది స్వాయంభువ మనువు కుమార్తె అయిన దేవహూతిని. మనువులకూ ప్రజాపతులకూ వైవాహికాది సంబంధాలుండటం గమనించదగిన విషయం. ఒకరు బ్రాహ్మణులూ మరొకరు క్షత్రియులు. జ్ఞాన క్రియాశక్తులు రెంటికీ రెండూ సంకేతాలు. వారి కలయిక జగత్సృష్టికీ స్థితికీ ఆవశ్యకమని పురాణ హృదయం. వారిరువురి సాంగత్య ఫలమే కపిలావతారం. తదుపదేశం వల్ల తరించింది దేవహూతి. స్త్రీలకు కూడా విద్యాధికారముందని సూచిస్తుందీ కథ. ప్రపంచ సృష్ట్యాదికమంతా వర్ణించబడింది ఇందులో. జీవుడి సంసార మోక్షగతి వృత్తాంతం కూడా ఎంతో విస్తారంగా ప్రతిపాదించబడింది.
పోతే చతుర్థ స్కంధంలో ముఖ్యమైనది దక్షప్రజాపతి. ధ్రువుడు, పృథువు, ప్రాచీనబర్హి వీరి చరిత్ర. దక్షుడు కర్దముడి లాగే ప్రజాపతుల కోవలోని వాడు. కర్దముడికి సాక్షాత్తూ తోడల్లుడు. అయితే అతనికుండే శమదమాదులితనికి లేవు
Page 96