#


Index

రచనా ప్రణాళిక

మహాఫలం. తరువాత దాని కనుబంధంగా ప్రపంచ సృష్ట్యాదికమూ, భగవదవతార వర్ణనమూ చేయబడ్డాయి. సర్గశ్చ ప్రతి సర్గశ్చ అని సృష్టి లయ వర్ణన పురాణంలో అవశ్యంగా ఉండి తీరుతుంది. పోతే మనువంశం - వంశానుచరితం - ఆ రెండింటికీ మధ్య స్థితి కాలంలో జరిగే వ్యవహారం. ఇందులో దాగి ఉన్న సూచన ఏమంటే మానవుడా రెండు దశలలో ఏదీ చేయటానికి సమర్థుడు కాడు. ఏదైనా చేసినా చెందినా మధ్య దశలోనే. అది మహాపురుషులెలా సాధించారో వారి జీవితాలు వర్ణిస్తే తెలుసుకొని మనమూ బాగుపడతాము. ఇదీ ఇక్కడ ఉన్న రహస్యం.

  పోతే తృతీయ స్కంధంలో విదుర మైత్రేయ సంవాద మొకటీ - కపిలదేవ హూతి సంవాదమొకటీ చాలా ప్రధానమైన అంశాలు. రెండూ ధర్మ మోక్ష ప్రతిపాదకాలే. ఎన్నో ధర్మ రహస్యాలన్నీ ఇందులో ప్రవచింపబడతాయి. “ఆచార్య వాన్ పురుషోవేద” అనే గురు శిష్య సంప్రదాయానికివి రెండూ నిదర్శనాలు. భారతంలో విదురపాత్రకూ, ఇక్కడి పాత్రకూ సంబంధం లేదు. కథా గమనంలో కూడా ఎంతో మార్పు కనిపిస్తుంది. భారత యుద్ధానికి పూర్వమే విదురుడు హస్తిన నుంచి నిష్క్రమించటం. పారివ్రాజ్యాన్ని అవలంబించి చివరకు కృష్ణ నిర్యాణ వార్త కూడా విని ఆయా గురువుల వల్ల పరమాత్మ తత్త్వోపదేశం పడసి తరించటమిక్కడ విశేషం. దీనిని బట్టే చెప్పవచ్చు కథలనేవి యథార్థం కావు అవన్నీ కేవలమొక సత్యాన్ని మనకు సూచించే అర్థవాదాలేనని. జయ విజయుల శాపవృత్తాంతం హిరణ్యాక్ష వధ - ఇక్కడే వర్ణించబడ్డాయి. జయ విజయుల వృత్తాంతం మరలా సప్తమ స్కంధా రంభంలో వస్తుంది. ఇక్కడ హిరణ్యాక్ష వధకు ముందైతే అక్కడ హిరణ్య కశిపు సంహారానికి ముందు, వీరిరువురూ జయ విజయుల మొదటి జన్మ. ఇది కృతయుగంలో, పోతే నవమ స్కంధంలో రామావతార చరిత్రలో వారి రెండవ జన్మ రావణ కుంభ కర్ణులు, కాగా మూడవది దశమ స్కంధంలో కృష్ణావతార చరిత్రలో వస్తుంది. అదే శిశుపాల దంత వక్త్రుల జన్మ. మొత్తానికీ మూడు జన్మలెత్తి ముక్తులవుతారా జయ విజయులు. వారెవరో కాదు. వైకుంఠ ద్వారపాలకులే. స్వామిదర్శనా పేక్షులై వచ్చిన సనకాదుల నడ్డగించి వారి శాపకారణంగా పరమాత్మకు దూరమయ్యారు. మరలా ఆయన అనుగ్రహం కారణంగా వైర వ్యాజంతో దగ్గర పడ్డారు.

Page 95

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు