జేర్చి కాపాడుతానని చెప్పి అంతర్ధానమవుతాడు. ఆ తరువాత ఆయన చెప్పినట్టే జరుగుతుంది. ఆ కాళరాత్రిలో బ్రహ్మ మయి మరచి గుఱ్ఱు పెట్టి నిదురిస్తుంటే హయగ్రీవుడనే దానవుడు ఆయన చేతిలోని వేదాల నపహరిస్తాడు. హరి మీనావతారుడై వాని నన్వేషిస్తూ ఉండగా ఈ సత్యవ్రతుడు సప్తర్షులతో ఓడనెక్కి కూర్చుండి ఆ దేవుని చూచి ఆసక్తితో సన్నుతిస్తాడు. దాని కాయన సంతోషించి సాంఖ్య యోగ విద్యా సమన్వితమైన పురాణ సంహిత నుపదేశిస్తాడు. ఆ సత్యవ్రతుడే తరువాతి కల్పంలో వివస్వంతుని కుమారుడైన వైవస్వత మనవుగా జన్మిస్తాడు. ఆ మనువు కాలంలో జరిగిందే వామనావతార గాథ. ఇది దానికి ముందే జరిగిందని వర్ణించటంవల్ల మత్స్యావతారం వామనావతారానికి నృసింహావతారానికీ మధ్యస్థమైనదిగా భావించవలసి ఉంటుంది.
పోతే ఈ వైవస్వతుడనే సప్తమ మనువుకు పదిమంది సంతానం. వారిలో పెద్దవాడిక్ష్వాకువు. వివస్వంతుడంటే సూర్యుడు కాబట్టి ఈ వంశమంతా సూర్యవంశం క్రిందికి వస్తుంది. ఈ సూర్యవంశంలో క్రమానుగతంగా అనేకమంది రాజులు రాజ్యమేలిపోయిన తరువాత వరుసగా రఘువూ, అజుడూ, దశరథుడూ అయి ఆ దశరథుడికి విష్ణుమూర్తి రాముడనే పేరుతో జన్మిస్తాడు. కనుక రామావతార ఘట్టం అంబరీష సగరాది రాజన్యుల తరువాత నవమ స్కంధంలో వర్ణించబడింది. రామావతారమైన తరువాత పరశురామ వృత్తాంతం వర్ణితమయింది పురాణంలో. కారణమేమంటే రాముడు సూర్య వంశీయుడైతే పరశురాముడు చంద్ర వంశ్యుడు. మొదట సూర్యవంశాన్ని వంశానుచరితాన్ని వర్ణించిన తరువాత చంద్ర వంశ వర్ణన కుపక్రమించింది పురాణం. దానిని బట్టి పరశురాముని కథ రాముని అనంతరం ప్రస్తావించటమయింది. పైగా ఈ పరశురాముడు తరువాత మనువు కాలంలో సప్తర్షులలో ఒకడుకాబోతాడు. అంతదాకా మహేంద్ర పర్వతం మీద తపస్సు చేస్తూ కూచుంటాడాయన. ఇక్కడికి నవమ స్కంధం సమాప్తమవుతుంది.
పోతే ఇక దశమ స్కంధంలో బలరామ కృష్ణావతారాల వృత్తాంతం సవిస్తరంగా వర్ణితమవుతుంది. ఏకాదశ స్కంధం వారి నిర్యాణంతో ముగుస్తుంది. ఆ తరువాత ద్వాదశంలో చివరిదైన కల్క్యవతార గాథ. మొత్తానికి నాలుగైదారులు తప్ప విడిస్తే మిగతా తొమ్మిది స్కంధాలలోనూ ఆ భగవానుడి పది అవతారాల వర్ణనా
Page 91