#


Index

రచనా ప్రణాళిక

ఈ అజితుడే కూర్మరూపాన్ని ధరించి మందర పర్వతాన్ని మోసింది. అందులోనూ తాత్పర్యమేమంటే సముద్ర మథనమనేది చరాచర సృష్టి ప్రయత్నాని కొక సంకేతం. అందులో రాళ్లూ, రప్పలూ, చెట్లూచేమలూ, పశువులూ, పక్షులూ, స్త్రీ పురుషులూ, విషామృతాది ద్వంద్వాలూ, అన్నీ ఆవిర్భవిస్తాయి. దైవాసుర శక్తులు రెండూ కలిసి మథిస్తాయి. ఆ రెండింటి సంఘర్షణ ఫలమే ఈ సృష్టి, దీనికంతటికీ ఈశ్వర శక్తి ఆధారం కాకపోతే ఏదీ లేదు. అంతా హుళుక్కే. ఆ భావాన్ని సూచించేదే ఈ కూర్మావతార వృత్తాంతం.

  పోతే సప్తమ మనువయిన వైవస్వతుడి కాలంలో వస్తుంది వామనావతారం. అదితి కశ్యపుల కిక్కడ విష్ణువు వామనుడనే సంజ్ఞతో జన్మిస్తాడు. వామనావతార కథ మనకు తెలిసిందే. అందులోనూ ఉంది ఒక రహస్యం. ఈ మన్వంతరంలో బలి అనేదానవు డింద్రుడు. దానవులకు దైవసంపద దక్కటం పరమాత్మ కిష్టం లేదు. కనుక ఊర్ధ్వాభిముఖంగా అతడు పయనిస్తుంటే అతణ్ణి అధోముఖంగా అణగద్రొక్కాడు. అందుకోసం త్రివిక్రముడయ్యాడు. త్రివిక్రమాలూ త్రిగుణాలే. ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః అన్నట్టు సత్త్వగుణ మూర్ధ్వగామి. మధ్యే తిష్ఠంతి రాజసాః రజోగుణం మధ్యవర్తి. ఇవి రెండూ దేవమానవ సర్గాలు. పోతే జఘన్య గుణమైన తమస్సు కిక్కడ చోటు లేదు. కనుక మూడవ పాదంతో తత్ప్రతినిధి రూపమైన బలిని అధోలోక నివాసిని గావించాడు. ఇది వామనావతార కథ.

  పోతే ఇక మత్స్యావతారం. ఇది సత్యవ్రతుడనే రాజు కథతో ముడిబడి ఉంది. అతడంతకు ముందటి కల్పాంతంలో ద్రావిడ దేశాధిపతి. సాధుశీలుడు. పరమ భాగవతుడు. హరితర్పణంబుగా జలతర్పణం చేస్తుంటే దోసిటిలోకి ఒక చేప పిల్ల వచ్చి పడుతుంది. దానినెక్కడ తీసుకుపోయి చేరిస్తే అక్కడి కిను మిక్కిలిగా పెరిగిపోతుంది. ఇలా ఒక దినానికి శతయోజన మాత్రంగా విస్తరించే సరి కారాజాశ్చర్యపడి నీవు మత్స్య మాత్రుడవు కావు నన్నుద్ధరింప వచ్చిన నారాయణుడవని వర్ణించి మత్స్యమూర్తి ధరించటానికి కారణమడుగుతాడు. దానికి సమాధానమిస్తూ ఆ పరమాత్మ ఈనాటి నుంచి ఏడవ నాటికి బ్రహ్మదేవుడి కొక పరార్ధం Half నిండి ప్రళయమాసన్న మవుతుంది. అప్పుడా ప్రళయ పయోరాశిలో మీ బోటి పుణ్యపురుషులు మునుగకుండా నేను మీనరూప ధరుడనై మిమ్మందర నొక నావలో

Page 90

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు