ప్రతిష్ఠాపన
ఒక మూల పదార్ధంలో నుంచి వచ్చిన వస్తువులన్నిటికీ ఆ మూల పదార్ధమే స్వరూపం. బంగారం నుంచి తయారైన ఆభరణాలన్నిటికీ బంగారమే గదా స్వరూపం. అది కటకంలో ఉన్నది. కేయూరంలో ఉన్నది. కుండలంలో ఉన్నది. కిరీటంలో ఉన్నది. సొమ్ములన్నింటిలోనూ పరుచుకొని ఉన్నదది. కనుక వాటన్నిటికీ వాటి వాటి ప్రాతిస్వికమైన Individual రూపాలు గాదు స్వరూపం. వ్యస్తమైన ఆ రూపాలన్నిటినీ వ్యాపించిన ఈ సువర్ణమనే సమస్త రూపం. అది స్వరూపమంటే.
ఈ స్వరూపమనేది మనకు కనిపిస్తూన్న ఈ సమస్త ప్రపంచానికీ మనతో సహా ఆ ఈశ్వర చైతన్యమేనని గదా నిరూపించాము తత్త్వ సాహిత్యంలో, మరి ఈ భౌతిక ప్రపంచానికే అయినప్పుడీ ప్రపంచాన్ని చూచి రూపుదిద్దుకొన్న ఆ సాహిత్య ప్రపంచానికి మాత్రమెలా కాకపోతుంది. దానికీ ఆ పరిశుద్ధ చైతన్యమే స్వరూపమయి తీరాలి తప్పదు. కాగా ఆ చైతన్యమనేది మనమింతకు ముందు చెప్పుకొన్న వైయక్తిక సామాజిక రాజకీయాది రంగాల మాదిరి పరిమితం కాదు. ఎందుకంటే అది సాపేక్షమైనది కాదు గనుక. సమస్త దేశ కాల వస్తువులనూ వ్యాపించినది గనుక నిరపేక్షమైన పదార్ధమది. నిరపేక్ష మెప్పుడయిందో అప్పుడది పరిచ్ఛిన్నం కావటానికి లేదు. అంచేత మిగతా వాటి మాదిరి గాక అపరిచ్ఛిన్నమూ పరిపూర్ణమూ అయినది దాని క్షేత్రం.
ఇలాటి పరిపూర్ణమైనది గనుకనే తాత్త్వికమైన దృష్టి అన్ని దృష్టులకన్నా ఉత్కృష్టమైనది. అది అన్ని దృష్టులనూ, వాటి మూలంగా ఏర్పడిన అన్ని సృష్టులనూ కూడా వ్యాపిస్తుంది. అది స్వరూపమైతే ఇవన్నీ దాని విభూతి, బంగారం స్వరూపమైతే కటక కుండలాదులన్నీ దాని విభూతి అయినట్టే ఇదంతా దాని విభూతే. ఇదంటే ఈ కనిపించే ప్రపంచమనే గాదు. దీనితో పాటు దీనికి ప్రతిరూపమైన సాహిత్య ప్రపంచం కూడా దాని విభూతే కావలసి ఉంది. అంటే ఏమన్నమాట. శ్రుతి స్మృతి పురాణేతి హాస కావ్య నాటకాఖ్యాన కాఖ్యాయికాది శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఈ మన సాహిత్యంలో కథలనీ, పాత్రలనీ, సన్నివేశాలనీ, వర్ణనలనీ, భావాలనీ, ఉద్దీపనలనీ ఏయే అంశాలే కరువు పెడుతున్నానో అవన్నీ ఈ విశ్వానికంతా మూల భూతమైన ఆ చైతన్యం తాలూకు మూర్తులే కళలే.
Page 9