ప్రతిష్ఠాపన
ఆత్మ అయితే సృష్టి దానికి శాబ్దికమైన ఒక శరీరం. అది అమూర్తం కాబట్టి, ఇది దాన్ని మనకు మూర్తీకరించి చూపుతుంది. అంతవరకూ నిజమే. కాదనలేదు.
కాని ఈ దృష్టి అని పేర్కొంటున్నామే. ఏమిటీ దృష్టి. మానవుడెప్పుడు గానీ తన దేశ కాలాలను దాటిపోలేడు. తన పరిధిలోనే ఏదైనా ఆలోచిస్తుంటాడు. అది తన గృహ జీవనమో, తన చుట్టూ ఉన్న సమాజ జీవనమో, ఈ రెండింటి మీదా ప్రభావం చూపే రాజకీయమో ఇలాంటి రాజకీయాలు పెక్కింటికి నెలవైన ఈ ప్రపంచమో, ఈ ప్రాపంచిక శ్రేయస్సు కంతటికీ మూలమైన నైతిక ధార్మిక ప్రవర్తనమో, ఇదే గదా మానవుడి భావనా పరిధి. ఇంతకు మించి మరేమున్నది. తరచి చూస్తే ఇందులో ఏ ఒక్క రంగమైనా అది పరిమితమే. ఎందుకంటే ప్రతి ఒకటీ ఒకదానికొకటి సాపేక్షం Related ఒకటిగా గాక అన్నింటినీ కలుపుకొని చూచినా అదీ పరిచ్ఛిన్నమే. తద్ద్వారా కలిగే ఫలితమేమిటి మనకు. ఒక ప్రబోధమో Enlightenment ఒకానొక మానసిక పరివర్తనమో Transformation. ఇంతేగదా. అదైనా ఎంత ప్రబోధమని. ఎంత పరివర్తనమని పరిపూర్ణం కాదు. శాశ్వతికం కాదు.
కాబట్టి అటు సౌందర్యారాధనా, ఇటు కర్తవ్య ప్రబోధనా, ఇవి ఏవీ పూర్తిగా గమ్యం కావు సాహిత్యానికి. ఇలాంటి ప్రయోజనాలెన్ని చెప్పినా అవి పాక్షికమైనవే. అంధ గజ దృష్టాంతాన్ని జ్ఞప్తికి తెస్తాయివన్నీ, ఏ అంధుడు చూచానని చెప్పినా అది సమగ్రమైన ఏనుగు రూపం కాదు. అందులో ఏదో ఒక అవయవమే వాడు చూచింది. అలాగే ఏ సారస్వతేయుడే అభిప్రాయంతో విమర్శించి చెప్పినా, అది సాహిత్య స్వరూపంలో ఏకదేశమే Particular phase. సార్వత్రికం కాదు. సార్వత్రికం కానంత వరకూ అది సత్యమూ కాదు. భావుకుడైన వాడికి దానివలన సంతృప్తి లేదు.
పోతే ఇక సాహిత్యమనేది ఏ దృష్టితో పరిశీలిస్తే అది సర్వాంగీణమైన Comprehensive దృష్టి అని ఇప్పుడు ప్రశ్న. అదే మేము మొదట వర్ణించి చెప్పిన తాత్త్విక దృష్టి తాత్త్విక దృష్టితో చూచినప్పుడే అది నిజమైన సాహిత్య విమర్శ. తత్త్వమంటే ఏమని చెప్పాము. వస్తు స్వరూపమని గదా.
Page 8