ప్రతిష్ఠాపన
నిధి దొరికినంతగా సంతోషపడతాము. లౌకిక జీవితంలోనే ఇది అనివార్య మయినప్పుడిక సాహిత్య జీవితంలో చెప్పవలసినదేముంది. సాహిత్యమంటే లోకానికి ప్రతిబింబమే గదా. లోకంలో ప్రతిదాని స్వరూప స్వభావాలేమిటా అని ఎలా అన్వేషిస్తున్నామో సాహిత్యంలో కూడా అలాగే తత్త్వగవేషణ చేయవలసి ఉంటుంది. నీవు కథలన్నావు. పాత్రలన్నావు. రసమన్నావు. భావమన్నావు. వర్ణనలూ సన్నివేశాలన్నావు. ఇవన్నీ లేవనటం లేదు మేము. కావనటం లేదు. వీటన్నిటి తత్త్వమేమిటి ప్రయోజనమేమిటనే మా ప్రశ్న ప్రశ్న దేనికి. వాటిని వాటి మేరకు చూచి సరిపుచ్చుకోమనవచ్చు నీవు. అది సత్యాన్వేషకుడి లక్షణం కాదు. గమ్యమేమిటో తేల్చుకొనే వరకూ అన్వేషణ చేయక తప్పదు.
ఆ దానికేమి, సాహిత్యానికి గమ్యమేమిటని ఇంత దూరం విచారణ దేనికి. సౌందర్యమే దాని తత్త్వం. లోకోత్తరమైన ఆహ్లాదాన్ని ప్రసాదించటమే దాని గమ్యం. ఇంతకన్నా ఏమున్నదని బుకాయించవచ్చు. కాని ఇది ఒక సమాధానం కాదు. చాలా పేలవమైన సమాధానమిది. సౌందర్యమే అయితే ప్రకృతిలో కావలసినంత కనిపిస్తుందది. ఒక పర్వతమేమిటి, సముద్రమేమిటి, ఒక శరజ్యోత్స్న ఏమిటి, ఒక నక్షత్ర కవచితమైన వినీలాకాశమేమిటి, ప్రకృతి దృశ్యాలన్నీ సహజ సుందరాలే. అలాగే ఆయా దృశ్యాలు తిలకించేటపుడూ శబ్ద స్పర్శాదులనుభవించేటప్పుడూ, కలిగే ఆనందం కూడా మనకు సహజంగానే కలుగుతున్నది. అలాంటప్పుడొక సాహిత్యమనేది క్రొత్తగా సృష్టించుకొని దానివల్ల కృత్రిమంగానైనా పొందవలసిన అగత్యమేమున్నది.
కేవలం సౌందర్య దృష్టి కాదు. దాని కతీతమైన ఉపదేశ దృష్టి కూడా ఉంది సాహిత్యానికని కొందరు వర్ణిస్తారు. వాస్తవమే. సద్యఃపర నిర్వృతే Delight గాక ఉపదేశ ప్రయోజనం Instruction కూడా ఉందనే చెబుతా రాలంకారికులు Literary critics దానికి తగినట్టు మహాకవులు కూడా అలాగే సాహిత్య సృష్టి చేస్తూ వచ్చారు. దృష్టిలేని సృష్టి అంటూఎక్కడా లేదు.ఏదో ఒక దృష్టి పెట్టుకొనే సృష్టిస్తాడే రచయిత అయినా. అది రచన ఆ మూల చూడమూ వ్యాపించి ఉంటుంది. దానితో సహితమై ఉండటం మూలాన్నే అది అసలు సాహిత్యమయిందని కూడా అనుకోవచ్చు. దృష్టి
Page 7