ఆ రావటంలో కూడా పాండవులు పూర్వజీవితం కాకుండా ఉత్తర జీవితం రావటంలో ఇంకా అందముంది. జ్ఞానవైరాగ్యాలు మానవుడికి వార్ధక్యంలోనే సహజంగా ఉదయిస్తాయి. అంతకుముందు జీవితంలో ఎన్నో ఢక్కా మొక్కీలు తిని ఉంటాడు. వాటన్నిటి ఫలితంగా పలితకేశుడైన తరువాతనే పరిపాకమనేది ఏర్పడుతుంది. శాస్త్రదృష్టితో మాటాడితే దీనినొక విధంగా త్వం పదార్థ శోధనమని పేర్కొనవచ్చు. అలాటి శోధన జరిగితే గాని తత్పదార్థమైన భగవత్సాయుజ్యానికి నోచుకోలేడు మానవుడు. అది లోకానికి బోధించటమే గదా భాగవతోద్దేశం. పాండవుల వృత్తాంత వ్యాజంతో అలాటి బోధే చేస్తున్నదిప్పుడు. కనుకనే భారతంలో కనిపించిన పాండవులు గారీ పాండవులు. అక్కడ ప్రతి ఒక్కరూ అంతో ఇంతో రాగద్వేషాదులైన ద్వంద్వాల సంఘర్షణతో బ్రతుకు సాగించినవారు. వారే ఇక్కడా తారసిల్లినా ఆ దుర్బలభావాలు కనిపించ విక్కడ. ద్రౌపదిగాని భీమార్జునులు గాని చివరకు కుంతిగాని, ధృతరాష్ట్రుడుగాని ప్రతి పాత్రా ఎంతో నిగ్రహాన్నీ - నిర్లిప్తతనూ ప్రదర్శించటం చూస్తామిందులో. ఈ ఈ పాత్రలను చిత్రించటం ద్వారా ఇలాటి జ్ఞాన వైరాగ్యాల నలవరచుకొని బాగుపడండని మనందరినీ హెచ్చరిస్తున్నాడు మహర్షి, అదే గదా భాగవత సందేశమసలు. ఇదీ భారత వృత్తాంతంతో భాగవత పురాణ మారంభం కావటంలో స్వారస్యం.
పోతే భగవచ్చరిత్ర గదా భాగవతమంటే. భగవచ్చరిత్ర అంటే అది ఆయన అవతార చరిత్రే. ఈ అవతారాలు ప్రసిద్ధంగా చెప్పుకొనేవి పది అవతారాలు. మత్స్యావతారం మొదలుకొని కల్క్యవతారంతో సమాప్తమవుతాయి ఈ దశావతారాలు. ఈ అవతారాలూ వీటి వృత్తాంతమూ పండ్రెండు స్కంధాలలోనూ పరిచినట్టుగా కనిపిస్తున్నది మనకు భాగవతంలో. భాగవతం తృతీయ స్కంధంలో వరాహావతార కథ. సప్తమ స్కంధంలో నృసింహావతారం అష్టమంలో కూర్మవామన మత్స్యావతారాలు. నవమంలో రామావతారం, పరశు రామావతారం రెండూ వస్తాయి. పోతే దశమంలో బలరామ కృష్ణావతారాలు రెండూ, ఇక ద్వాదశంలో చివరిదైన కల్క్యవతార ప్రస్తావన వస్తుంది. ఇలా పన్నెండు స్కంధాలూ అయ్యేసరికి భగవంతుడి పది అవతారాల చరిత్రా పరిపూర్ణంగా వర్ణించబడుతుంది. అందులోనూ ప్రథమంలో కృష్ణావతారంతో ఆరంభమై ద్వాదశంలో కల్క్యవతారంతో మరలా సమాప్తం కావటం ఎంతో సాభిప్రాయంగా Intentional జరిగింది.
Page 87