#


Index

రచనా ప్రణాళిక

పోతే కృష్ణ జననం మరలా దశమ స్కంధంలో వర్ణించటమేమిటని గదా ప్రశ్న. అలాగే వర్ణించాలి తప్పదు. ఎందుకంటే భగవంతుడి అవతారకథలు వర్ణిస్తూ పోతుంది భాగవతం. ఆ అవతారాలలో కృష్ణావతార మనేది తొమ్మిదవది. మొదటి నుంచీ మత్స్యకూర్మాద్యవతారాలన్నీ వర్ణిస్తూ కృష్ణావతారాన్ని వర్ణించవలసి వచ్చేసరికి దశమ స్కంధంలో గాని వర్ణించటానికి లేకపోయింది. దశమ పూర్వోత్తర భాగాలంతా ఆయన చరిత్రే. తరువాత ఏకాదశంలో ఉద్ధవోపదేశమూ దాని అంతంలో నిర్యాణమూ వర్ణించబడ్డాయి. ఆ పిమ్మట ద్వాదశంలో పదియవదైన కల్క్యవతార ప్రస్తావన వస్తూంది. దానితో పురాణం సహజంగానే సమాప్తమవుతున్నది. కాబట్టి కృష్ణ నిర్యాణం ప్రథమ స్కంధంలో కృష్ణజననం దశమంలో మరలా నిర్యాణం ఏకాదశాంతంలో జరిగినట్టు వర్ణించటం పైకి విడ్డూరంగా కనిపించినా భాగవత తాత్పర్యాన్ని బట్టి చూస్తే అందులో ఎంతో గాంభీర్యం కనిపిస్తుంది మనకు.

  ఆ మాటకు వస్తే మరొక విడ్డూరం గూడ మనమిక్కడ గమనించవచ్చు. అది భాగవతం భారతకథతో ఆరంభం కావటం, పరీక్షిత్తనీ పాండవులనీ, గాంధారీ ధృతరాష్ట్రులనీ, భీష్మ విదురులనీ వీరంతా భారత కాలం నాటి పాత్రలు. వీరికి భాగవతంలో ప్రవేశమేమిటి. భారతానికీ, భాగవతానికీ ఏమిటి సంబంధం. అది ఇతిహాసం – ఇది పురాణం. అది ద్వాపర యుగచరిత్ర. ఇది కలియుగ వృత్తాంతం. రెంటికీ ఏమిటీ బాదరాయణ సంబంధం. బాదరాయణుడే కల్పించాడీ సంబంధం. ఆయన భారతానికే గాదు. ఇంకా మాటాడితే రామాయణానికి కూడా ముడి పెట్టాడు. భారతం ద్వాపరందయితే రామాయణం త్రేతాయుగం నాటిది గదా. అలాటి రామాయణ కథ కూడా పట్టుకు వస్తాడు భాగవతంలో. అందులో భారత కథ ప్రథమ స్కంధంలో అయితే రామాయణ గాధ నవమ స్కంధంలో వస్తుంది.

  ఇది ఎందుకిలా జరిగిందని మనకు విడ్డూరంగా తోచవచ్చు. కాని లోతుకు దిగి చూస్తే ఇందులో కూడా ఎంతో మర్మముంది. భారత రామయణాలనేవి ఇతిహాసాలు. ఇతిహసమనేది ధర్మప్రధానమని చెప్పాము. అది మోక్ష ప్రధానమైన పురాణంలో గతార్థం Implied కాక తప్పదు. ధర్మంకన్నా గొప్పది గదా మోక్షం. అందుకే భారత రామాయణాలు భాగవతంలో అంతర్భవించినట్టు వర్ణించటం. అంతేకాదు. భారతం ద్వాపర వృత్తాంతం రామాయణం త్రేతా వృత్తాంతమని

Page 85

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు